Nimmakayala Chinarajappa: లోకేష్ పై పవన్ కల్యాణ్ విమర్శలకు కారణం ఇదే: చినరాజప్ప

  • నాయకుడిగా లోకేష్ ఎదుగుతున్నారు
  • ఆయనను తొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి
  • పవన్ విమర్శల వెనకున్న కారణం అదే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు సాగడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబే అని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. దీన్ని మరిచిపోయి... వెనుక ఏదో ఒక శక్తి చెప్పించినట్టు పవన్ కల్యాణ్ మాట్లాడటం మంచిది కాదని అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక బీజేపీ హస్తం ఉందని మండిపడ్డారు. బీజేపీకి, పవన్ కు మధ్య రాయబారం ఎవరు నడిపారనే విషయం త్వరలోనే తేలిపోతుందని చెప్పారు. చంద్రబాబును, లోకేష్ ను విమర్శించడం సరికాదని అన్నారు. నిధుల కోసం, స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతున్న ఈ తరుణంలో, పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడటం ఎంతమాత్రం మంచిది కాదని చెప్పారు.

ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీపై టీడీపీ పోరాట ధోరణిని అవలంబించడంతో... టీడీపీపైకి పవన్ ను, జగన్ ను బీజేపీ ఎగదోస్తోందని చినరాజప్ప అన్నారు. వైసీపీ ఎంపీలను ప్రధాని కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడుతున్నారని, ఇప్పుడు పవన్ ను ఎంకరేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ట్రాప్ లో పవన్ పడ్డారని అన్నారు.

మంచి నాయకుడిగా ఎదుగుతున్న నారా లోకేష్ ను తొక్కేయడం కోసమే... ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని చినరాజప్ప మండిపడ్డారు. లోకేష్ పై పవన్ నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ గురించి కూడా మాట్లాడలేదని, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీ గురించి, బీజేపీలను ఒక్క మాట కూడా అనలేదని... ఇవన్నీ వాస్తవాలను తెలియజేస్తున్నాయని అన్నారు. కేవలం చంద్రబాబును విమర్శించేందుకే సభను నిర్వహించినట్టు ఉందని తెలిపారు. ఎమ్మెల్యేలంతా అవినీతి పరులే అన్న పవన్ వ్యాఖ్యలను చినరాజప్ప ఖండించారు. ఒకరిద్దరు చేసిన పనులకు అందర్నీ విమర్శించడం సరికాదని అన్నారు. రేపొద్దున జనసేనకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు కావాలని... అప్పుడు ఎక్కడ నుంచి తీసుకొస్తారో చూద్దామని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో పవన్ ఎటు వెళ్లినా తమకు నష్టం లేదని... ప్రజలంతా టీడీపీ వెంటే ఉన్నారని చెప్పారు. 

More Telugu News