Telangana: ప్రియుడితో గడిపిన వీడియోలు భర్తకు పంపి.. అతని ఆత్మహత్యకు కారణమైన భార్య

  • పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం
  • పెళ్లి తరువాత కూడా ప్రియుడితో అనుబంధం
  • ప్రియుడితో కలిసి అసభ్యకరంగా గడిపి, ఆ వీడియోలు భర్తకు పంపిన భార్య

ప్రియులతో కలిసి భర్తలను హతమారుస్తున్న భార్యల లీలలు వెలుగు చూస్తుండగా, బరితెగించిన భార్య ఆగడాలు భరించలేకపోయిన భర్త, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా దండేప‌ల్లి మండ‌లం ధ‌ర్మారావుపేట పంచాయ‌తీ ప‌రిధిలోని శ్రీరాముల ప‌ల్లె గ్రామంలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన న‌క్క ధ‌ర్మరాజుకు జ‌గిత్యాల జిల్లా క‌న్నాపూర్‌ కు చెందిన ముద్దం నాగ‌ల‌క్ష్మితో ఏడాది క్రితం వివాహం జరిగింది. ధర్మరాజుకు ఊర్లో ఒక పార్టీ క్రియాశీలక కార్యకర్తగా, పిలిస్తే పలికే వ్యక్తిగా మంచి పేరుంది. వివాహం వరకు ఆనందంగా సాగిన ధర్మరాజు జీవిత పయనం నాగలక్ష్మి రాకతో గతి తప్పింది.

 ఆమెకి పుట్టింటికి దగ్గర్లోని వెల్గటూరుకు చెందిన మంత్రి మ‌హేష్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలిసింది. దీనిని నిలదీయడంతో భర్త ముందే ప్రియుడితో బరితెగించి మాట్లాడేది. పుట్టింటికి వెళ్లినప్పుడల్లా ప్రియుడితో కలిసి తిరిగేది. ఏడాది పాటు గుట్టుగా సాగిన ఆమె వివాహేతర సంబంధం వ్యవహారం ఈ మధ్యే బట్టబయలైంది. నెలరోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన నాగలక్ష్మి, తిరిగి మెట్టినింటికి రాలేదు. దీంతో భర్త, అత్తింటివాళ్లు  ఆమెకు ఫోన్‌ చేయడం మొదలు పెట్టారు.

వారి ఫోన్ కి స్పందించని నాగలక్ష్మి భర్త ఫోన్ కు వాట్స్ యాప్ లో కొన్ని వీడియోలు పంపింది. ఆ వీడియోల్లో ప్రియుడితో అసభ్యకరంగా ఉన్న దృశ్యాలు ఉన్నాయి. వాటితో పాటు తను కట్టిన తాళిని తీసేసి ప్రియుడితో దానిని మెళ్లో వేయించుకున్న దృశ్యాలు ఉన్నాయి. వాటిని చూసిన ధర్మరాజు గుండె బద్దలైంది. కుటుంబ సభ్యులకు చెప్పుకుని కన్నీరుమున్నీరయ్యాడు. దీంతో వారు మహేష్ ఫోన్ నెంబర్ సంపాదించి, వివాహితతో వివాహేతర సంబంధం మంచిది కాదని హితవు పలికారు.

తామిద్దరం ఆమె వివాహానికి ముందు నుంచే ప్రేమించుకుంటున్నామని, పెళ్లి కూడా చేసుకుంటామని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని మహేష్ దురుసుగా సమాధానమిచ్చాడు. దీంతో తీవ్రంగా కలతచెందిన ధర్మరాజు వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి, ఊర్లోని వారికి సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన పొలం దగ్గరికి వెళ్లిన గ్రామస్థులు అపస్మారక స్థితిలో ఉన్న ధర్మరాజును దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులు మృత్యువుతో పోరాడిన ధర్మరాజు మృతి చెందాడు. దీంతో నాగలక్ష్మి, మహేష్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News