Finland: అగ్రదేశమైనా అమెరికాలో సంతోషం కరవు.. ప్రపంచంలోనే సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్.. వందలోపు కనిపించని భారత్!

  • సంతోషకరమైన దేశాల జాబితాలో 133వ స్థానంలో భారత్
  • మనకంటే పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ బెటర్ స్థానాల్లో
  • నాలుగు స్థానాలు దిగజారిన అమెరికా

ప్రపంచంలోనే ధనిక దేశమైనా అమెరికన్లు సంతోషంగా లేరట. ఇక ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలవగా, బురాండీ అట్టడుగున నిలిచింది. ఐక్యరాజ్య సమితి సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెటవర్క్ (ఎస్‌డీఎస్)-2018 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యం, సామాజిక స్వేచ్ఛ, అవినీతి, దాతృత్వం తదితర వాటిని ఆధారంగా చేసుకుని మొత్తం 156 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల్లో గతేడాది ఐదో స్థానంలో ఉన్న ఫిన్లాండ్ ఈసారి అగ్రస్థానానికి ఎగబాకగా ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, నార్వే, ఐస్‌ల్యాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, స్విట్జర్లాండ్, మెక్సికో తదితర దేశాలున్నాయి.

ఈ జాబితాలో గతేడాది 14వ స్థానంలో ఉన్న అమెరికా ఈసారి 18వ స్థానానికి పడిపోగా బ్రిటన్ 19, యూఏఈ 20 స్థానంలో నిలిచాయి. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ 75వ స్థానంలో నిలవగా భారత్ మాత్రం 133వ స్థానంలో నిలిచింది. మనకంటే చైనా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక ప్రజలే సంతోషంగా ఉన్నట్టు నివేదిక తేల్చింది. ఈ జాబితాలో బురాండీ అట్టడుగున నిలిచింది.

More Telugu News