ayodhya: రామాలయ నిర్మాణానికి ముస్లింలు స్థలాన్ని ఇవ్వడమే పరిష్కారం: శ్రీశ్రీ రవిశంకర్

  • కోర్టు వెలుపలే పరిష్కారం సాధ్యం
  • ఒక వర్గం వారికి అనుకూల తీర్పు వస్తే మరో వర్గంలో ఆగ్రహానికి దారితీస్తుంది
  • ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం లేదని వెల్లడి

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవాది పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ అయోధ్య విషయంలో మరోసారి తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి గాను స్థలాన్ని ముస్లింలు కానుకగా ఇవ్వాలని ఆయన సూచించారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం విషయంలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య సయోధ్యకు రవిశంకర్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదానికి చక్కని పరిష్కారం కోర్టు బయటే సాధ్యమవుతుందన్నారు. గొప్ప రామాలయాన్ని నిర్మించేందుకు గాను స్థలాన్ని ముస్లింలు హిందువులకు కానుకగా ఇవ్వడాన్ని పరిష్కారంగా పేర్కొన్నారు. ముస్లింలలో షియా, సున్నీ వర్గాలతో ఇటీవలే చర్చలు జరిపిన రవిశంకర్ ప్రభుత్వంతో మాత్రం సంప్రదింపులు చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఓ వర్గానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే రక్తపాతానికి దారితీస్తుందంటూ ఇటీవలే రవిశంకర్ ఘాటుగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఒక వర్గం వారికి అనుకూలంగా తీర్పు ఇస్తే, మరో వర్గం వారిలో ఆగ్రహానికి దారితీస్తుందన్న ఆయన కోర్టు వెలుపల సయోధ్యే పరిష్కారంగా చెబుతున్నారు.

More Telugu News