Panchayati Raj Act: బిడ్డ తనదో? కాదో? తేల్చేందుకు మహిళా సర్పంచ్‌కి డీఎన్ఏ పరీక్ష..!

  • సర్పంచ్ పదవి కోసం మూడో బిడ్డ సమాచారాన్ని దాచారని మహిళా సర్పంచ్‌పై ఫిర్యాదు
  • గతేడాది డిసెంబరు 29న తోరీ గ్రామ సర్పంచ్‌గా ఎన్నిక
  • డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలంటూ జిల్లా అభివృద్ధి అధికారి ఆదేశం

సాధారణంగా తండ్రెవరో తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తుంటారు. కానీ గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఓ మహిళా సర్పంచ్‌కి ఈ పరీక్ష చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతేడాది డిసెంబరు 29న జిల్లాలోని కుకావవ్ తాలూకా, తోరీ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన జ్యోతి రాథోడ్‌కి ఈ పరీక్ష చేయాలంటూ జిల్లా అభివృద్ధి అధికారి (డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్-డీడీఓ) గతవారం ఆదేశించారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న సర్పంచ్‌లను అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ పదవి కోసం జ్యోతి తనకు పుట్టిన మూడో బిడ్డ విషయంలో నిజాలను దాచారంటూ బాలభాయ్ రాథోడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కుకావవ్ తాలూకా అభివృద్ధి అధికారి ఎన్‌పీ మాళవియా ఆమెను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఫిర్యాదుదారుడి ఆరోపణలకు సంబంధించి కొన్ని దస్త్రాలను పరిశీలించిన పిదప జ్యోతికి ముగ్గురు పిల్లలున్నారని తెలుసుకుని ఆమెను సర్పంచ్‌గా అనర్హురాలిగా ప్రకటించానని మాళవియా తెలిపారు. ఈ నేపథ్యంలో బాధిత సర్పంచ్ తనపై అనర్హత వేటును సవాలు చేస్తూ డీడీఓని ఆశ్రయించారు. జ్యోతి రాథోడ్ తనకు పుట్టిన మూడో బిడ్డ తల్లి పేరును నీతా అని, తండ్రి పేరును భరత్ అని తప్పుడు సమాచారమిచ్చారంటూ బాల రాథోడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందువల్ల ఆమెకు డీన్ఏ పరీక్షలు చేయిస్తే అసలు నిజం బయటకు వస్తుందని ఆయన తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. అన్ని ఆధారాలను, ఆరోపణలను పరిశీలించాక జ్యోతికి డీఎన్ఏ పరీక్ష చేయించాలంటూ డీడీఓ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

More Telugu News