Stephen Hakwing: కృష్ణ బిలాలపై అపార పరిశోధన... చక్రాల కుర్చీకే పరిమితమైన మహాజ్ఞాని... స్టీఫెన్ హాకింగ్ గురించిన ఆసక్తికర వివరాలు!

  • బ్లాక్ హోల్స్ పై అపార పరిశోధనలు
  • మృత్తువు అంచులకు చేరిన వేళ కూడా ప్రసంగాలు
  • సహకరించని విధిని అనుకూలంగా మార్చుకున్న జ్ఞాని

సుప్రసిద్ధ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్)పై అపార పరిశోధనలు చేసి ఎన్నో వ్యాసాలు రాసిన మహాజ్ఞాని స్టీఫెన్ హాకింగ్ నేడు కన్నుమూశారు. కదలడానికి ఏ మాత్రమూ సహకరించని శరీరంతో, చక్రాల కుర్చీకే పరిమితమైన స్టీఫెన్, తాను మాట్లాడేందుకు ప్రత్యేక కంప్యూటర్ సాయం తీసుకుంటారు. మోతార్ న్యూరాన్ వ్యాధి రోజురోజుకూ శరీరాన్ని మృత్యువు అంచులకు దగ్గర చేస్తున్న వేళలోనూ తన పరిశోధనలను ఆపని స్టీఫెన్, తనకు సహకరించని విధిని అనుకూలంగా మార్చుకుని పరిశోధనలు సాగించారు. ప్రస్తుతం ప్రపంచ మానవాళి హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను తొలుత ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో మరణించిన మూడు శతాబ్దాల తరువాత జన్మించిన స్టీఫెన్ ను భవిష్యత్తులో గెలీలియోను గుర్తు పెట్టుకున్నట్టుగానే మానవాళి గుర్తుంచుకుంటుందనడంలో సందేహం లేదు.
స్టీఫెన్ హాకింగ్ జీవితంలో ముఖ్య ఘట్టాలు...
* జనవరి 8, 1942న ఆక్స్ ఫర్డ్ లో జననం
* రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండటంతో సురక్షిత ప్రాంతానికి తరలిన కుటుంబం
* ఆపై హైగేట్స్ ప్రాంతానికి వచ్చి విద్యాభ్యాసం
* గణిత శాస్త్ర విద్యపై స్టీఫెన్ ఆసక్తి... రసాయన శాస్త్రంలో చేర్పించిన తండ్రి
* 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్
* 1962లో తొలిసారిగా బయటపడిన అనారోగ్యం
* యూనివర్శిటీలో పరిచయమైన మహిళతో వివాహం
* ఇద్దరు మగపిల్లలు, ఓ ఆడపిల్ల జననం
* స్టీఫెన్ కు మోటార్ న్యూరాన్ వ్యాధి సోకినట్టు తేల్చిన వైద్యులు
* కనీసం బూట్ల లేస్ కూడా కట్టుకోలేని స్థితికి చేరిన స్టీఫెన్
* డాక్టరేట్ రాకుండానే మరణిస్తాడని తేల్చిన వైద్యులు... స్టీఫెన్ ఆత్మస్థైర్యం ముందు ఓడిన మృత్యువు
* తిరిగి వర్శిటీకి వచ్చి పరిశోధనలు మొదలు
* మొదటి భార్యతో విడాకుల తరువాత తనకు సేవలందిస్తున్న నర్సుతో వివాహం
* తన రోగాన్ని మరచిపోయి క్వాంటమ్ థియరీ సాయంతో బ్లాక్ హోల్స్ పై విస్తృత పరిశోధన
* 1984లో 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' పుస్తకంతో రచనలు మొదలు
* తొలి పుస్తకంతోనే ఎనలేని ఖ్యాతి... తెలుగులో 'కాలం కథ' పేరుతో విడుదల
* 1985 మరింత విస్తరించిన వ్యాధి, పూర్తిగా ఆసుపత్రికే పరిమితం
* మాట్లాడే కంప్యూటర్ ను ఒంటికి అమర్చుకున్న స్టీఫెన్
* అప్పటి నుంచి వర్శిటీలో ప్రొఫెసర్ గా, వ్యాసకర్తగా, ప్రసంగీకుడిగా లక్షలాది మందిలో స్ఫూర్తి నింపిన స్టీఫెన్ హాకింగ్
* ఆరోగ్యం పూర్తిగా విషమించి మార్చి 14, 2018... బుధవారం కన్నుమూత

More Telugu News