aaraku mp: రాజకీయ ప్రయోజనాల కోసమే ‘ప్రత్యేక హోదా’ ఉద్యమం చేస్తున్నారు : అరకు ఎంపీ కొత్తపల్లి గీత

  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం ఎప్పుడో చెప్పింది
  • అయినప్పటికీ రాజకీయపార్టీలు పోరాడుతున్నాయి!
  • ప్రజలను భ్రమల్లోకి నెడుతున్న రాజకీయపార్టీలు
  • ఓ ఇంటర్వ్యూలో ఎంపీ కొత్తపల్లి గీత

రాజకీయ ప్రయోజనాల కోసమే అన్ని రాజకీయ పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తెరపైకి తెచ్చాయని అరకు ఎంపీ కొత్తపల్లి గీత విమర్శించారు. ‘ఎన్ టీవీ’ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పిందని, అయినప్పటికీ రాజకీయపార్టీలు పోరాడుతున్నాయని విమర్శించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు స్వప్రయోజనాల కోసం ‘ప్రత్యేక హోదా’ను తమ అజెండాగా చేసుకున్నాయని, ప్రజలను భ్రమల్లోకి నెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ఉద్యమాలకు తాను మొదటి నుంచి వ్యతిరేకమని అన్నారు. అయితే, నాడు సమైక్యాంధ్ర ఉద్యమంలో తాను కూడా పాల్గొన్నానని, ఆ ఉద్యమంలో ఎంత మంది నష్టపోయారో తాను కళ్లారా చూశానని అన్నారు. ‘ఉద్యమం ద్వారానే తెలంగాణను వాళ్లు సాధించుకున్నారుగా!’ అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, ఉద్యమం ద్వారా వాళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారంటే తాను నమ్మనని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం  తెలంగాణ రాష్ట్ర్రాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని అభిప్రాయపడ్డారు.

More Telugu News