Jaya Bachchan: రూ.1000 కోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతురాలైన పార్లమెంటేరియన్‌గా జయాబచ్చన్ రికార్డు!

  • సమాజ్‌‌వాదీ తరపున రాజ్యసభకు నామినేషన్ 
  • అఫిడవిట్‌లో తన ఆస్తులను రూ. వెయ్యి కోట్లుగా ప్రకటన
  • జయా బచ్చన్ తర్వాతి స్థానంలో బీజేపీ ఎంపీ రవీంద్ర కిషోర్

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తరపున రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన నటి, రాజకీయ నాయకురాలు జయాబచ్చన్ అత్యంత ధనవంతురాలైన పార్లమెంటేరియన్‌గా రికార్డు సృష్టించనున్నారు. నామినేషన్ సందర్భంగా ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులను రూ.1,000 కోట్లుగా ప్రకటించారు. దీంతో ఆస్తుల విషయంలో బీజేపీ ఎంపీ రవీంద్ర కిషోర్ సిన్హాను ఆమె అధిగమించారు. 2014లో ఆయన తన ఆస్తులను రూ.800 కోట్లుగా ప్రకటించారు.

2012లో ఎస్పీ అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ వేసిన సందర్భంగా జయా బచ్చన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన  ఆస్తులను రూ.493 కోట్లుగా ప్రకటించారు. తాజా అఫిడవిట్ ప్రకారం ఆ ఆస్తులు రెండింతలయ్యాయి. ఈ మొత్తం ఆస్తిలో రూ.62 కోట్ల బంగారు ఆభరణాలు ఉండగా, అందులో ఆమె భర్త అమితాబ్ బచ్చన్‌కు చెందినవే రూ.36 కోట్లు ఉండడం గమనార్హం. అలాగే రూ.13 కోట్ల విలువైన రూ.12 వాహనాలున్నాయి. అందులో రోల్స్ రాయస్, మూడు మెర్సిడస్ బెంజ్‌లు, ఓ పోర్చ్ కారు, రేంజ్ రోవర్‌లు ఉన్నాయి.

అమితాబ్‌కు టాటా నానో కారు, ట్రాక్టర్ కూడా ఉన్నాయి. అమితాబ్‌ వద్ద రూ.3.4 కోట్లు, జయా బచ్చన్ వద్ద రూ.51 లక్షల విలువైన వాచీలు ఉన్నాయి. అమితాబ్ వద్ద రూ.9 లక్షల విలువైన పెన్ను ఉంది. అలాగే ఫ్రాన్స్, నోయిడా, భోపాల్, పూణె, అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో ఆస్తులు ఉన్నట్టు జయాబచ్చన్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

More Telugu News