Harish Rao: మైకును పట్టుకుని తిప్పి తిప్పి విసిరేశారు.. రౌడీల్లా ప్రవర్తించారు: హరీశ్ రావు

  • ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైనది శాసనసభ
  • అటువంటి సభలో ఇలా ప్రవర్తించవచ్చా?
  • సభలో జరిగే వ్యవహారాలను పిల్లలు, విద్యార్థులు కూడా చూస్తున్నారు
  • ఇక్కడకు చట్టాలు చేయడానికి వచ్చామా? గొడవపడడానికి వచ్చామా?

కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజు అసెంబ్లీలో రౌడీలు, గుండాల్లా ప్రవర్తించారని, అంతేగాక తమపై కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీలో మైకును పట్టుకుని తిప్పి తిప్పి విసిరేశారని, ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైనది, అన్నింటి కంటే ముఖ్యమైనది శాసనసభ అని, అటువంటి సభలో ఇలా ప్రవర్తించవచ్చా? అని ప్రశ్నించారు. సభలో జరిగే వ్యవహారాలను పిల్లలు, విద్యార్థులు కూడా చూస్తున్నారని, ఇక్కడకు చట్టాలు చేయడానికి వచ్చామా? వీధి రౌడీల్లా గొడవపడడానికి వచ్చామా? అని ఆయన నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో ప్రస్టేషన్ కనపడుతోందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం తరఫున గవర్నర్ కి ధన్యవాదాలు తెలిపే సమయంలో మాటల రూపంలో ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఉందని, అలా మాట్లాడకుండా భౌతికంగా దాడులకు దిగారని అన్నారు. తమ పార్టీకి ఎంతో చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు ఇలా ప్రవర్తించడమేంటని, ఇదేనా మీ చరిత్ర? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలకు కావలసినన్ని రోజులు సభను జరుపుతామని, ఆయా పార్టీల సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని అన్నారు. అసెంబ్లీలో ఇటువంటి చర్యలు మంచివి కావని అన్నారు. 

More Telugu News