New Delhi: నిరాహారదీక్ష చేస్తా: కేజ్రీవాల్ సంచలన ప్రకటన

  • వెంటనే సీలింగ్ డ్రైవ్ ను నిలిపివేయాలి
  • కేంద్రం చర్యలతో వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన
  • మార్చి 31లోగా సమస్య పరిష్కారం కాకుంటే దీక్ష

దేశ రాజధానిలో జరుగుతున్న సీలింగ్ డ్రైవ్ ను వెంటనే నిలుపుదల చేయకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. మార్చి 31లోగా ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఆయన, ఆ సమయానికి కేంద్రం స్పందించకుంటే, నిరాహారదీక్షకు దిగి మరింత ఒత్తిడిని పెంచుతామని ఆయన అన్నారు. దక్షిణ ఢిల్లీలోని లజపత్ నగర్ లో వ్యాపారులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఈ విషయంలో వ్యాపారుల్లో ఎంత ఆందోళన ఉందో తనకు తెలుసునని అన్నారు.

 ఢిల్లీ నగర మాస్టర్ ప్లాన్ మార్చడం తప్పనిసరని, అయితే, ఇదే సమయంలో చాలా చట్టాలను మార్చాల్సి వుందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. డీడీఏ చేయాలనుకుంటున్న మార్పులను గతంలో సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని గుర్తు చేసిన ఆయన, ఆర్డినెన్స్ నైనా తీసుకు వచ్చి వ్యాపారుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ విషయమై శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీకి తాను లేఖను రాస్తానని, వచ్చే వారంలో కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీని కలిసి చర్చిస్తానని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News