Rahul Gandhi: ఫ్రాన్స్ అధ్యక్షుడిని కలవాలని రాహుల్ నిర్ణయం... కానీ ఆ విషయాన్ని మాత్రం ప్రస్తావించరట!

  • భారత పర్యటన నిమిత్తం వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
  • ప్రస్తుతం సింగపూర్ లో రాహుల్ గాంధీ
  • ఆదివారం రాహుల్, మాక్రాన్ మధ్య చర్చలు
  • రఫాలే డీల్ ప్రస్తావన ఉండబోదన్న కాంగ్రెస్

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కలుసుకోనున్నారు. థాయ్ లాండ్, సింగపూర్ దేశాల పర్యటనకు వెళ్లిన ఆయన నేటి రాత్రి తిరిగి ఇండియాకు వస్తారని, ఆపై ఆదివారం నాడు వీరి భేటీ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ సమావేశంలో రాహుల్ రఫాలే యుద్ధ విమానాల కొనుగోలు డీల్ గురించిన ప్రస్తావన తేబోరని కాంగ్రెస్ పార్టీ సమాచార విభాగం ఇన్ చార్జ్ రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో 2015 ఏప్రిల్ లో ఫ్రాన్స్ లో పర్యటించి రఫాలే డీల్ ను కుదుర్చుకుని రాగా, ఆపై అది వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

ఈ డీల్ గురించి రాహుల్, మాక్రాన్ ల మధ్య ఎటువంటి చర్చలూ ఉండవని, రఫాలే డీల్ భారత అంతర్గత అంశమని, తమ ప్రశ్నలకు భారత ప్రభుత్వం నుంచి సమాధానం రావాలే తప్ప ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి కాదని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రజల డబ్బులు వృథా కారాదన్నదే కాంగ్రెస్ ఉద్దేశమని వెల్లడించారు. ఈ విమానం ధర చాలా అధికంగా ఉందని, దీనివల్ల ప్రభుత్వానికి రూ. 12,612 కోట్లు నష్టమని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఖతార్, ఈజిప్ట్ సంస్థలకు ఇవే రఫాలే విమానాలను దస్సాల్ట్ ఏవియేషన్ అందించిందని గుర్తు చేసిన ఆయన, ఆ దేశాలు ఇచ్చిన మొత్తంతో పోలిస్తే అధికంగా ఇండియా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఒక్కో విమానాన్ని రూ. 351 కోట్లు చెల్లించి ఎందుకు కొనుగోలు చేయాలని సుర్జేవాలా ప్రశ్నించారు

More Telugu News