America: చీకట్లో మగ్గిపోతున్న అమెరికా.. అంధకారంలో 50 లక్షల మంది!

  • అమెరికాలో ఎన్నడూ లేని పరిస్థితులు
  • విద్యుత్ లేక, కనీస అవసరాలు తీరక ప్రజలు ఇబ్బందులు
  • వచ్చే వారం మరో మంచు తుపాను 
  • వేలాది విమానాలు రద్దు

అగ్రరాజ్యం అమెరికా ప్రజలు కనీవినీ ఎరుగని అగచాట్లు ఎదుర్కొంటున్నారు. మంచు తుపాను దెబ్బకు అల్లాడిపోతున్నారు. వారం వ్యవధిలో సంభవించిన రెండు తుపాన్లకు అమెరికాలోని న్యూజెర్సీ, మాసాచుసెట్స్, న్యాహ్యాంప్‌షైర్, పెన్సుల్వేనియా తదితర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. తుపాను ధాటికి విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడంతో జనం కారు చీకట్లలో మగ్గిపోతున్నారు. దాదాపు 10 లక్షల మంది కరెంటు లేక విలవిల్లాడిపోతున్నారు. విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉండడంతో అప్పటి వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ అధికారులు ప్రజలకు సూచించారు.

మరోవైపు  ప్రతికూల వాతావరణం కారణంగా అమెరికా వ్యాప్తంగా 2,700 విమాన సర్వీసులు రద్దు కాగా, 2400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మంచు తుపాను తాకిడికి గ్రామీణ ప్రాంతాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. విద్యుత్ లేక, ఆహార పదార్థాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరుసగా రెండు తుపాన్లతో అల్లాడుతుంటే వచ్చే వారం మరో తుపాను వచ్చే అవకాశం ఉందన్న వార్తలతో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు.

More Telugu News