KCR: థర్డ్ ఫ్రంట్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న కేసీఆర్.. ప్రగతి భవన్‌లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం

  • స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా అభివృద్ధి అంతంతే
  • రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారం కావడం లేదు
  • తెలంగాణ పథకాలను దేశవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది
  • సలహాలు, సూచనలు అందించండి: కేసీఆర్

దేశ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన తెలంగాణ సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ప్రగతి భవన్‌లో వివిధ రంగాల ప్రముఖులు, సీనియర్ అధికారులతో గంటన్నరకుపైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా అనుకున్న అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారం కావడం లేదని, దేశ ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో తెలంగాణ అనేక మైలు రాళ్లను అధిగమించందని, తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని అన్నారు. ఈ పథకాలను దేశవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థల్లో మార్పులు రావాలని, ఇందుకోసం స్పష్టమైన ఎజెండా రూపొందాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో దేశంలోని అధికారులు, రాజకీయ నాయకులు, రిటైర్డ్ అధికారులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చి తగిన సూచనలను ఇవ్వాలని కేసీఆర్ కోరారు.

More Telugu News