Harish Rao: నాపై వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దు: హరీష్ రావు

  • నా పుట్టుక, చావు రెండూ టీఆర్ఎస్ లోనే
  • టీఆర్ఎస్ నుంచి నేను బయటకు రావడం లేదు
  • కేసీఆర్ మాటే నా బాట
కేటీఆర్ ను కేసీఆర్ ముఖ్యమంత్రిని చేయబోతున్నారని... ఈ నేపథ్యంలో, 40 మంది ఎమ్మెల్యేలతో కలసి మంత్రి హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, హరీష్ రావు స్పందించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు. తాను పుట్టింది టీఆర్ఎస్ లో అని, చచ్చేది కూడా టీఆర్ఎస్ లోనే అని అన్నారు.

టీఆర్ఎస్ లో క్రమశిక్షణ కలిగిన ఓ కార్యకర్తను తాను అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటే తన బాట అని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కూడా కోరానని చెప్పారు. తాము ఉద్యమాలు, త్యాగాల మీద వచ్చినవారమని... కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులకు గడ్డిపోచ మాదిరిగా రాజీనామాలు చేసిన చరిత్ర తమదని హరీష్ అన్నారు. ఇలాంటి పుకార్లకు అందరూ ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. ఇలాంటి గాసిప్స్ కు ప్రచారం కల్పించవద్దని మీడియా ప్రతినిధులను కోరారు.
Harish Rao
KCR
KTR
TRS
BJP

More Telugu News