Cricket: ఓటమికి కారణం నువ్వే...సోషల్ మీడియాలో రిషబ్ పంత్ పై విమర్శలు

  • సుమారు నాలుగు ఓవర్లు ఆడి 23 పరుగులు చేసిన రిషబ్ పంత్
  • నీవల్లే ఓడిపోయామంటూ విమర్శలు
  • నెటిజన్లతో పాటు విశ్లేషకులు కూడా విమర్శలు

నిదహాస్‌ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్ లో ఓటమికి కారణం టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ నిరాశాజనక ప్రదర్శనేనని ఆరోపిస్తూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గత ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా భారత జట్టులో స్థానం సంపాదించుకున్న రిషబ్ పంత్ ను భవిష్యత్ ఆశాకిరణంగా అంతా భావించారు. ఈ క్రమంలో కీపర్ బ్యాట్స్ మన్ దినేష్ కార్తిక్ కంటే ముందు బ్యాటింగ్ కు పంపారు. అయితే రిషబ్ పంత్ తనపై ఉన్న భారీ అంచనాలను అందుకోలేకపోయాడు. వచ్చిన ప్రతి బంతిని బలంగా బాదే ప్రయత్నం చేసిన పంత్, ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటుకు బంతిని సరిగ్గా కనెక్ట్ చేయడంలో తడబడ్డాడు.

 దీంతో సుమారు నాలుగు ఓవర్లు (23 బంతులు) బ్యాటింగ్ చేసిన పంత్ కేవలం 23 పరుగులే చేశాడు. దీంతో భారీ విజయ లక్ష్యం నిర్దేశిస్తుందనుకున్న భారత్ ఆతిథ్య జట్టుకు 175 పరుగుల సాధారణ లక్ష్యాన్నే నిర్దేశించింది. దీనిని లంకేయులు సులభంగా అధిగమించారు. ఈ నేపథ్యంలో పంత్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

‘పంత్‌ నీ ఇష్టం వచ్చినట్లు ఆడటానికి ఇది ఐపీఎల్‌’ కాదని ఒక నెటిజన్ పేర్కొంటే, 'పంత్‌ లా ధోని ఆడితే ఇప్పటికే రిటైర్మెంట్‌ కావాలన్న డిమాండ్ పెరిగేది' అంటూ మరొక నెటిజన్ సెటైర్ వేశాడు. రిషబ్ పంత్ ప్రదర్శనపై ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే ట్విట్టర్ లో ‘అంతర్జాతీయ క్రికెట్‌ లో ఈ రోజు యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ కు మరో నేర్చుకునే రోజుగానే మిగిలిపోయింది.’ అని వ్యాఖ్యానించాడు. ఇక మాజీ ఆటగాడు, క్రీడా విశ్లేషకుడు ఆకాష్ చోప్రా 'ప్రపంచమంతా నీ అద్భుత ప్రదర్శన కోసం ఎదురు చూస్తే నిరాశ పరిచావు' అని ట్వీట్‌ చేశాడు.

More Telugu News