Jagan: జగన్‌తో పాటు వైసీపీ నేతలు తెరచాటు రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి కాల్వ శ్రీనివాసులు

  • మచ్చలేని చంద్రబాబుతో ఏ1 నిందితుడు జగన్ కు పోలికా?
  • ఏపీ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబునాయుడు ఎంతో త్యాగం చేశారు
  • చంద్రబాబుపై జగన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డివి కుహానా రాజకీయాలని, 11 కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న ఆయనకు సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాల్వ‌ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవ్వడం వల్లే టీడీపీ ప్రభుత్వం పోరుబాట పట్టిందన్నారు.

2018-19 బడ్జెట్ లోనూ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఎటువంటి నిధులు కేటాయించలేదన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబునాయుడు ఎంతో త్యాగం చేస్తే, కొనియాడాల్సిందిపోయి, ఆయనపై జగన్ లేనిపోని అబండాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏపీ హక్కుల సాధనలోనూ, రాష్ట్ర ప్రయోజనాల లక్ష్య ఛేదనలోనూ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజీపడలేదని మంత్రి కాల్వ‌ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

జాతీయ రాజకీయాల్లోనూ సీఎం చంద్రబాబునాయుడు గతంలో క్రీయాశీలకంగా పనిచేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుల్లో మొదటి రెండు స్థానాల్లో చంద్రబాబునాయుడు ఉంటారన్నారు. మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన చంద్రబాబునాయుడుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, నోటికిచ్చినట్లు మాట్లాడుతున్న జగన్ ను ప్రజలు ఎప్పుడూ క్షమించరన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎంపీగా ఉన్న జగన్ తీరును రాష్ట్ర ప్రజలెవ్వరూ ఇంకా మరిచిలేపోలేదని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు.

జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ తో కుమ్మకై, సోనియాగాంధీ ఆశీస్సులతో బెయిల్ తెచ్చుకున్న విషయం జగన్ కు గుర్తు లేదా? అని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలతో చేయి కలిపి టీడీపీని బలహీన పర్చాలని కుట్రలు చేయడం వాస్తవం కాదా? అని నిలదీశారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని, వేల కోట్ల రూపాయలు దోచుకున్న జగన్... చంద్రబాబు నాయుడిపై లేనిపోని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.

ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ ఏడాదిన్నర నుంచి జ‌గ‌న్ డెడ్ లైన్లు పెట్టుకుంటూ వస్తున్నార‌ని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రమంత్రిగా ఉన్నా సరే సుజనా చౌదరి.. రాజ్యసభలో మాట్లాడితే, రాజీనామా చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. ఇదేనా ప్రతిపక్ష నేతలకు రాష్ట్ర ప్రయోజనాలపై ఉన్న ప్రేమా? అని మంత్రి నిలదీశారు. ఏపీ హక్కుల కోసం లోక్ సభ, రాజ్యసభను టీడీపీ సభ్యులు స్తంభింపజేస్తుంటే, విజయసాయిరెడ్డి మాత్రం దాక్కున్నారన్నారు.జగన్, ఆయన పార్టీ నేతలు లాలూచీ, తెరచాటు రాజకీయాలు చేస్తున్నారన్నారు.

జైలుకెళ్లిన విజయసాయిరెడ్డికి పీఎంవో కార్యాలయంలో ఏం పనుందని మంత్రి కాల్వ‌ శ్రీనివాసులు ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఏపీకి వచ్చినప్పుడు కోవింద్ కాళ్లపైన జగన్ పడ్డారని, కేసుల నుంచి బయటపడడానికి ఆయన గిమ్మిక్కులు చేస్తున్నారని మంత్రి అన్నారు. స్వార్థరాజకీయాలు చేస్తున్న జగన్ కు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడే హక్కులేదన్నారు.   

More Telugu News