ashok gajapati raj: ఏపీకి తన వంతు సాయం చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారు : టీడీపీ నేత సుజనా చౌదరి

  • పార్టీ ఆదేశాల మేరకు మంత్రి పదవులకు రాజీనామా చేశాం
  • రాజీనామా చేయడం తప్ప మరోమార్గం కనిపించలేదు
  • ఎంపీలుగా పార్లమెంటులో స్వతంత్రంగా వ్యవహరిస్తాం  

పార్టీ ఆదేశాల మేరకు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశామని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి అన్నారు. ప్రధాని మోదీని కలిసి తమ మంత్రి పదవులకు రాజీనామా లేఖలను వారు సమర్పించారు. అనంతరం, మీడియాతో మాట్లాడారు.
టీడీపీ నేత సుజనా చౌదరి మాట్లాడుతూ, ఏపీకి తన వంతు సాయం చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారని అన్నారు.

విభజన హామీలు ఆయా ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్నాయని, హామీల అమలులో జాప్యం జరిగినందున తమ పదవులకు రాజీనామా చేశామని, రాజీనామా చేయడం తప్ప మరోమార్గం కనిపించలేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయానికి కట్టుబడి రాజీనామా చేశామని, మంత్రి పదవులకు రాజీనామా చేసినందున ఎంపీలుగా పార్లమెంటులో స్వతంత్రంగా వ్యవహరిస్తామని చెప్పారు.

 ప్రధాని మోదీకి ఏపీ సమస్యలేంటో తెలుసు : అశోక్ గజపతి రాజు

కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సమస్యలేంటో తెలుసని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని, కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పుకున్నప్పటికీ ఎన్డీఏలో కొనసాగుతామని అశోక్ గజపతి రాజు అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ అమలు కాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మోదీకి వివరించామని అన్నారు. మంత్రులుగా దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధానికి కృతఙ్ఞతలు తెలిపామని చెప్పారు.

More Telugu News