Art Of Living: అయోధ్య వివాదంపై వ్యాఖ్యలకు 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' రవిశంకర్‌పై ఫిర్యాదు

  • భారత్‌లో సిరియా తరహా హింసాత్మక పరిస్థితుల వ్యాఖ్యలపై దుమారం
  • ఏఓఎల్ వ్యవస్థాపకుడిపై లక్నోలో మజ్లిస్ నేత ఫిర్యాదు
  • మజ్లిస్‌తో పాటు గతంలో శివసేన కూడా ధ్వజం

రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించకుంటే భారతదేశం సిరియా మాదిరిగా తయారవుతుందని వ్యాఖ్యానించిన 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఏఓఎల్)' వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌పై మజ్లిస్ నేత తౌహీద్ సిద్ధిఖి లక్నోలో ఫిర్యాదు చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. అయోధ్య స్థల వివాదాన్ని సత్వరం పరిష్కరించకుంటే భారత్‌లో సిరియా తరహా హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని ఓ టీవీ షోలో రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దేశవ్యాప్తంగా అనేక పార్టీలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టుతున్నాయి.

"రామాలయానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇస్తే, రక్తసిక్తమైన పరిస్థితులు నెలకొంటాయి. మెజార్టీ హిందువులు అలాంటి తీర్పును అంగీకరిస్తారా...చెప్పండి? వారు ముస్లిం వర్గంపై కోపావేశాలను ప్రదర్శించే అవకాశముంది" అని రవిశంకర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై మజ్లిస్‌తో పాటు శివసేన కూడా మండిపడింది. తన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ఆయన ప్రయత్నించారు. అయోధ్య కేసులో తాను చేసిన వ్యాఖ్యలు హెచ్చరిక కాదని, కేవలం ముందు జాగ్రత్త మాటలేనని ఆయన స్పష్టం చేశారు. అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు పరిష్కారం చూపలేదని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News