konakalla narayana: ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి : కొనకళ్ల నారాయణ

  • చంద్రబాబు నాయుడు చాలా ఓర్పుగా నాలుగేళ్లు ఎదురుచూశారు
  • కేంద్ర బడ్జెట్ లో కూడా ఏపీకి తీరని అన్యాయం చేశారు
  • ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదు  

రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించుకోవడం కోసమే బీజేపీతో టీడీపీ మిత్రపక్షంగా ఉందని, చంద్రబాబు నాయుడు చాలా ఓర్పుగా నాలుగేళ్లు ఎదురుచూసినప్పటికి ఫలితం లేకుండా పోయిందని టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణ అన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో నాలుగేళ్లుగా సమస్యలన్నీ అలాగే పెండింగ్ లో ఉన్నాయని, ఏ సమస్యకు పూర్తి పరిష్కారం లభించలేదని అన్నారు.

చంద్రబాబునాయుడి ఓర్పుకు అగ్నిపరీక్షలాగా కేంద్ర బడ్జెట్ లో కూడా ఏపీకి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఏపీలో సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలకు తీవ్ర అన్యాయం చేసినట్టవుతుందని భావించిన తర్వాతే కేంద్ర మంత్రి వర్గం నుంచి తమ మంత్రులు బయటకు రావాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన తప్పును తెలుసుకుని విభజన హామీలను ఏపీకి అమలు చేయాలని కోరుతున్నామని, ఇప్పటికే చాలా కాలయాపన జరిగిపోయిందని, ఏపీ ప్రయోజనాల కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని నారాయణ స్పష్టం చేశారు. కేంద్రం స్పెషల్ డ్రైవ్ చేపట్టి విభజన బిల్లులో ఏపీకి ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాల్సిందిగా కోరుతున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News