online: యువతి 'ప్రైవేటు' ఫొటోలు నెట్‌లో పెట్టిన బీటెక్ స్టూడెంట్‌కి ఐదేళ్ల జైలు...జరిమానా

  • బాధితురాలి ఫిర్యాదుతో జులై 21, 2017న నిందితుడి అరెస్ట్
  • పెళ్లి చేసుకుంటానంటే గుడ్డిగా నమ్మానని యువతి ఆవేదన
  • బాధితురాలు కాల్పనిక అత్యాచారానికి గురవుతోందని లాయర్ నివేదన

ఆన్‌లైన్‌లో పరిచయమై తనను నమ్మిన ఓ యువతి 'ప్రైవేటు' ఫొటోలను నెట్‌లో అప్‌లోడ్ చేసిన బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి కోర్టు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు తొమ్మిది వేల రూపాయల జరిమానా విధించింది. ఈ కేసులో ఈస్ట్ మిడ్నాపూర్‌లోని తమ్లుక్‌ కోర్టు ఈ మేరకు సత్వర తీర్పునిచ్చింది. బాధిత యువతిని అత్యాచార బాధితురాలిగా పరిగణించి ఆమెకు నష్టపరిహారం కూడా అందజేయాలంటూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని థర్డ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ గౌతమ్ కుమార్ నాగ్ ఆదేశించారు.

 ఈ కేసుకు సంబంధించి అడ్వొకేట్ బివాస్ ఛటర్జీ అందించిన వివరాల్లోకెళితే... బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందిత బీటెక్ విద్యార్థి అనిమేశ్ బోక్సీని జులై 21,2017న అరెస్టు చేశారు. ఈ కేసుపై వాదోపవాదాలు గత నెలాఖరుకల్లా ముగిశాయి. నిందితుడు తనకు మూడేళ్లుగా తెలుసునని, అందుకే అతన్ని గుడ్డిగా నమ్మానని బాధితురాలు విచారణలో వెల్లడించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతను తన ప్రైవేటు ఫొటోలను, వీడియోలను తీసుకున్నాడని ఆమె ఆరోపించింది.

ఆ తర్వాత తనతో శారీరక సంబంధం పెట్టుకోని పక్షంలో వాటిని నెట్‌లో పెడతానని అతను తనను బెదిరించాడని ఆమె తెలిపింది. అతని కోరికను కాదనడంతో అన్నంత పనీ చేశాడని ఆమె చెప్పింది. ఇది ప్రతీకారంతో చేసిన పనేనని, నెట్‌లో బాధితురాలి ఫొటోలపై ఎవరైనా క్లిక్ చేసిన ప్రతిసారి తాను కాల్పనికంగా అత్యాచారానికి (వర్చువల్ రేప్) గురవుతోందన్న విషయాన్ని కోర్టుకు వివరించినట్లు బివాస్ ఛటర్జీ తెలిపారు. కోర్టు తాజా తీర్పు అమ్మాయిలను ఇలా బ్లాక్ మెయిల్ చేసే యువకులకు చెంపపెట్టు లాంటిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News