paytm: చిన్న వయసులోనే బిలియనీర్ గా మారిన పేటీఎం అధినేత శర్మ

  • ఫోర్బ్స్ 2018 బిలియనీర్ల జాబితాలో 1,394వ స్థానం
  • 1.7 బిలియన్ డాలర్ల సంపద
  • 40 ఏళ్లలోపు బిలియనీర్లలో భారత్ నుంచి ఏకైక వ్యక్తి

చాలా చిన్న వయసులోనే 39 ఏళ్లకే పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ బిలియనీర్ గా మారి చరిత్ర సృష్టించారు. ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో శర్మకు 1,394వ స్థానం దక్కింది. మొత్తం 2,208 మంది బిలియనీర్లతో ఫోర్బ్స్ 2018 జాబితాను విడుదల చేసింది. శర్మకు 1.7 బిలియన్ డాలర్ల సంపద ఉన్నట్టు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. 40 ఏళ్లలోపు ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాందించుకున్న ఏకైక వ్యక్తి విజయ్ శేఖర్ శర్మనే. 2016లో పెద్ద నోట్ల రద్దు పేటీఎం అధినేతకు బాగా కలిసొచ్చింది. ఎక్కువ మంది డిజిటల్ వ్యాలెట్ల బాట పట్టారు. పేటీఎం డిజిటల్ పేమెంట్స్ తోపాటు ఈ కామర్స్, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు తదితర సేవల్లోకీ అడుగు పెట్టింది.

‘‘భారత డీమోనిటైజేషన్ కార్యక్రమంతో ఎక్కువగా లబ్ధి పొందిన వారిలో శర్మ ఒకరు. పేటీఎం 25 కోట్ల కస్టమర్లను సంపాదించింది. రోజూ 70 లక్షల లావాదేవీలను నమోదు చేస్తోంది. శర్మకు పేటీఎంలో 16 శాతం వాటా ఉంది’’ అని ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. ఇక ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ అధినేత సంప్రదసింగ్ అదిపెద్ద వయసులో ఉన్న బిలియనీర్ గా ఫోర్బ్స్ గుర్తించింది. 92 ఏళ్ల సంప్రద సింగ్ 1.2 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో 1,867వ స్థానంలో ఉన్నారు.

More Telugu News