Chandrababu: కాంగ్రెస్ కు పట్టిన గతి మీకు రాకుండా చూసుకోండి.. జైట్లీ మాటలు ఎంతో బాధించాయి: అసెంబ్లీలో చంద్రబాబు

  • అప్పుడు కాంగ్రెస్ చేసిందే.. ఇప్పుడు బీజేపీ చేస్తోంది
  • ఇలాగైతే జాతీయ పార్టీలపై నమ్మకం పోతుంది
  • రాజీనామాలు చేసినా.. బీజేపీ నేతలు రాష్ట్రం కోసం పని చేశారు

రాష్ట్రమంత్రులుగా బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు చాలా గొప్పగా పని చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. తమతమ శాఖల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం లేదని చెప్పారు. ఏపీకి అన్యాయం చేసినందుకే కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు తిరస్కరించారని... అలాంటి పరిస్థితే బీజేపీకి కూడా రాకుండా చూసుకోవాలని అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా... ప్రయోజనం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ముఖ్యమంత్రి అన్నారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడిన మాటలు తనను ఎంతో బాధించాయని చంద్రబాబు తెలిపారు. దేశంలోని ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత జాతీయ నాయకులపై ఉంటుందని చెప్పారు. ఒక రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువ ఇవ్వలేమని జైట్లీ చెప్పడం బాధాకరమని చెప్పారు. న్యాయబద్ధంగా మాకు రావాల్సినవి మాత్రమే ఇవ్వాలని అడుగుతున్నామని... గొంతెమ్మ కోరికలు కోరడం లేదని చెప్పారు.

ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తుంటే... జాతీయ పార్టీలపై నమ్మకం ఎలా ఉంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ ప్రయోజనాలను కాపాడతారనే నమ్మకంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. దేశంలో కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసిన ఘనత ఎన్టీఆర్ దేనని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లిపోయినా... రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరారు. 

  • Loading...

More Telugu News