Aadhar: మీరింకా ఆధార్ లింక్ చేయలేదా..?డోంట్ వర్రీ...మళ్లీ గడువు పొడిగించే ఛాన్స్...!

  • ఆధార్ కేసు తేలనందున మళ్లీ గడువు పొడిగించే ఛాన్స్
  • అటార్నీ జనరల్ వాదనతో ఏకీభవించిన సుప్రీం బెంచ్
  • ఇప్పటివరకు లింకు చేయని వారికి మళ్లీ అవకాశం
పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడానికి ఉద్దేశించిన ఆధార్‌ అనుసంధానం తుది గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించే అవకాశముంది. ఇప్పటివరకు ఈ గడువు ఈ నెలాఖరు వరకే ఉన్న సంగతి తెలిసిందే. దీనిని ప్రభుత్వం మరోసారి పెంచే అవకాశముందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆధార్ కేసు విషయంలో తుది తీర్పు రావడానికి మరింత సమయం పట్టే అవకాశమున్నందు వల్ల ఆధార్ లింకుకు తుది గడువును మార్చి 31 నుంచి మరికొంత కాలం పొడిగిస్తామని తెలిపింది.

ఈ దిశగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చేసిన వాదనతో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఏకే సిక్రి, ఏఎం ఖాన్‌విల్కర్, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. "గతంలో ఆధార్ అనుసంధానం తుది గడువును మేము పొడిగించాం. దీనిని మళ్లీ పొడిగిస్తాం. కానీ, ఆధార్ కేసులో పిటిషనర్ల వాదోపవాదాలు ముగిసిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటాం"అని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. అటార్నీ జనరల్ తాజా ప్రకటనతో ఇప్పటివరకు ఆధార్‌ను లింకు చేయని వారికి మళ్లీ అవకాశం లభించినట్లయింది. కాగా, గతేడాది డిసెంబరు 15న ఆధార్ తుది గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించిన సంగతి విదితమే.
Aadhar
Supreme Court
Attorney general
Centre

More Telugu News