South Delhi Municipal Corporation: ఆ స్కూళ్లలో వారానికోసారి పుస్తకాల మోతకు సెలవ్...!

  • సౌత్ ఢిల్లీ స్కూళ్లలో వారంలో ఓ రోజు 'బ్యాగ్‌లెస్ డే'
  • విద్యార్థులకు క్విజ్‌లు, క్రీడలు, పజిళ్ల సాధన
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు యోచన

విద్యార్థులు చదువుతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేలా చేయడానికి సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్  (ఎస్‌డీఎంసీ) ఓ కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. తన పరిధిలోని స్కూళ్లలో వారానికి ఓ రోజు విద్యార్థులు పుస్తకాలను తీసుకురావాల్సిన పనిలేకుండా చేయాలనుకుంటోంది. దీనిపై ఎస్‌డీఎంసీ మేయర్ కమల్‌జీత్ షెరావత్ మాట్లాడుతూ....వారంలో ఓ రోజు క్విజ్‌లు, క్లిష్టమైన పజిళ్లను సాధించడం, క్రీడలు లాంటి కార్యకలాపాల కోసం కేటాయిస్తున్నామని చెప్పారు. ఆ రోజు విద్యార్థులు పుస్తకాల బ్యాగులను స్కూలుకు తీసుకురావాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.

విద్యార్థులు చదువుతో పాటు అన్ని రకాలుగా రాణించేందుకు ఈ ప్రయత్నం దోహదం చేయగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ 'బ్యాగురహిత' రోజున ఎలాంటి కార్యకలాపాలను చేపట్టాలనే దానిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని ఆమె చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేస్తామని ఆమె చెప్పారు. కాగా, సౌత్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 581 స్కూళ్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

More Telugu News