kalva srinivasulu: గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రగతి చిత్రం స్పష్టం: మ‌ంత్రి కాల్వ శ్రీనివాసులు

  • గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి
  • అనేక అంశాల్లో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది
  • అభివృద్ధిలో పరుగులుపెడుతోంది
  • అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమానికి రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగం చేసి రాష్ట్ర ప్రగతి చిత్రం స్పష్టం చేశారని ఆంధ్ర‌ప్ర‌దేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ‌ శ్రీనివాసులు చెప్పారు. శాసనసభలో ఈ రోజు ఉదయం గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయన శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనట్లు తెలిపారు.

గడచిన మూడున్నరేళ్లలో సంక్షేమం, అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉందని, అభివృద్ధిలో పరుగులు పెడుతోందని చెప్పారు. విభజన అనంతరం రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, ఆదాయం తక్కువగా ఉండి, కేంద్రం నుంచి తగినంత సాయం అందకపోయినప్పటికీ రైతుల రుణమాఫీ, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించినట్లు తెలిపారు. సంక్షేమానికి రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికి 29 సార్లు ఢిల్లీ వెళ్లి విభజన చట్టంలో అమలు చేయవలసిన అంశాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఇతర కేంద్ర మంత్రులకు గుర్తు చేశారన్నారు. రెవెన్యూ లోటు, రాజధాని నిర్మాణం, కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరులో జాప్యం వంటి అన్ని అంశాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్ర‌భుత్వ‌ దృష్టికి తీసుకువెళుతున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో విద్య, ఆరోగ్యానికి పెద్దపీట వేసినట్లు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పలు మార్గాల్లో నిధులు, సాయం అందుతున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధితోపాటు రెండంకెల వృద్ధిరేటు సాధించినట్లు తెలిపారు. సభలో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిగిన తరువాత బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. చట్టసభల నుంచి ప్రజలు ఏమి ఆశిస్తారో ఆ విధంగా చర్చలు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలిపారు.

సమస్యల పరిష్కారానికి ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడాలేకుండా మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టాలని ఆయన సూచించినట్లు చెప్పారు. ప్రతి సమస్యపైన సమగ్రంగా చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. 

  • Loading...

More Telugu News