యూపీలో రాజకీయ సంచలనం... చేతులు కలుపుతున్న బద్ధ శత్రువులు ఎస్పీ, బీఎస్పీ
- నేడో, రేపో అధికారిక ప్రకటన
- ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు మాయావతి మద్దతు
- బీజేపీని ఎదుర్కొనేందుకే!
సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)ల కలయికపై అతి త్వరలో అధికారిక ప్రకటన విడుదలవుతుందని ఇరు పార్టీల వర్గాలూ మీడియాకు ఉప్పందించాయి. ఇరు పార్టీలూ కలసి ఓ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నాయని, ఈ సభలోనే పొత్తుపై ప్రకటన విడుదలవుతుందని, ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై సమాజ్ వాదీ యువనేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. రెండు ప్రాంతాల్లో ఎస్పీ అభ్యర్థులే ఉంటారని, వారికి మాయావతి మద్దతు ప్రకటిస్తారని సమాచారం.
కాగా, ఈనెల 11న ఈ రెండు ఉప ఎన్నికలూ జరుగనుండగా, 14న ఫలితాలు వెలువడతాయన్న సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎలాగైనా నిలువరించాలన్న ఉద్దేశంతో పాటు, 2019 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలుపుతున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.