Uttar Pradesh: యూపీలో రాజకీయ సంచలనం... చేతులు కలుపుతున్న బద్ధ శత్రువులు ఎస్పీ, బీఎస్పీ

  • నేడో, రేపో అధికారిక ప్రకటన
  • ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు మాయావతి మద్దతు
  • బీజేపీని ఎదుర్కొనేందుకే!

'రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు' అన్న నానుడి మరోసారి నిజమవుతోంది. బీజేపీ ధాటికి, నరేంద్రమోదీ హవాకు ఉత్తరప్రదేశ్ లో కుదేలైన బద్ధ శత్రువులు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ, మాయావతి అధినేత్రిగా ఉన్న బహుజన సమాజ్ పార్టీలు త్వరలో జరిగే గోరఖ్ పూర్, ఫుల్ పూర్ ఎంపీ సీట్ల ఉప ఎన్నికల కోసం చేతులు కలపనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే దేశ రాజకీయాల్లో పెను సంచలనమన్నట్టే.

సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)ల కలయికపై అతి త్వరలో అధికారిక ప్రకటన విడుదలవుతుందని ఇరు పార్టీల వర్గాలూ మీడియాకు ఉప్పందించాయి. ఇరు పార్టీలూ కలసి ఓ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నాయని, ఈ సభలోనే పొత్తుపై ప్రకటన విడుదలవుతుందని, ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై సమాజ్ వాదీ యువనేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. రెండు ప్రాంతాల్లో ఎస్పీ అభ్యర్థులే ఉంటారని, వారికి మాయావతి మద్దతు ప్రకటిస్తారని సమాచారం.

కాగా, ఈనెల 11న ఈ రెండు ఉప ఎన్నికలూ జరుగనుండగా, 14న ఫలితాలు వెలువడతాయన్న సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎలాగైనా నిలువరించాలన్న ఉద్దేశంతో పాటు, 2019 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలుపుతున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

More Telugu News