Donald Trump: మీ కార్లపై పన్నేస్తాం... ఐరోపా దేశాలకు ట్రంప్ హెచ్చరిక

  • ఉక్కు, అల్యూమినియంపై భారీగా దిగుమతి పన్ను వేస్తామన్న అమెరికా
  • దీనిపై మండిపడ్డ ఐరోపా యూనియన్
  • తామూ అమెరికా ఉత్పత్తులపై అదే చర్య తీసుకుంటామని హెచ్చరిక
  • అలా చేస్తే తాము సులభంగా ఐరోపా కార్లపై పన్నేస్తామన్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా యూనియన్ దేశాలకు తాజా హెచ్చరిక పంపారు. తమ దేశంలోకి దిగుమతి అవుతున్న ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం పన్ను విధిస్తున్నట్టు రెండు రోజుల క్రితమే ట్రంప్ ప్రకటన చేశారు. దేశీయ పరిశ్రమలను బలోపేతం చేసి, స్థానికులకు ఉపాధి అవకాశాల కల్పన కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అయితే, దీనిపై ఐరోపా దేశాల కూటమి, చైనా తదితర దేశాలు మండిపడ్డాయి. ఇది వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. దీనికి ప్రతిగా తాము కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే హార్లే డేవిడ్సన్ మోటారు బైకులు, బోర్బాన్ విస్కీ, లెవిస్ జీన్స్ పై పన్ను రేట్లు పెంచుతామని ఐరోపా యూనియన్ హెచ్చరించింది.

దీనిపై తాజాగా ట్రంప్ గట్టిగా స్పందించారు. ‘‘ఒకవేళ ఐరోపా యూనియన్ అమెరికా కంపెనీలపై భారీ స్థాయిలో విధిస్తున్న పన్నులను ఇంకా పెంచాలనుకుంటే, మేం సింపుల్ గా వారి కార్లపై పన్ను వేస్తాం. ప్రస్తుతం అవి ఏ పన్ను లేకుండా అమెరికాలోకి దిగుమతి అవుతున్నాయి’’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ హెచ్చరిక ఆ దేశాలను నిజంగా ఆలోచింపజేసేదే. ఎందుకంటే అమెరికా ప్రస్తుతం ఏటా 12 లక్షల ఐరోపా కార్లు (బీఎండబ్ల్యూ, వోక్స్ వ్యాగన్) దిగుమతి చేసుకుంటోంది.

More Telugu News