Mamata Benarji: రాహుల్ కు ఎంత చెప్పినా వినలేదు... కాంగ్రెస్ ఓటమిపై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్య!

  • చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని సూచించా
  • చెప్పినా కూడా విననందువల్లే ఓటమి
  • కాంగ్రెస్ నిర్లక్ష్యం బీజేపీకి ఆయువుగా మారింది
  • పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా ఎన్నికల్లో ముందుగానే చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తాను ఎంతగానో చెప్పానని, పొత్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే కాంగ్రెస్ వైఫల్యం చెందిందని, అదే ఎత్తుగడతో బీజేపీ విజయం సాధించిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో స్పందించిన ఆమె, బీజేపీని ఓడించాలంటే ప్రాంతీయ పార్టీలతో భాగస్వామ్యమే ముఖ్యమని రాహుల్ కు సూచించినా, తన మాటను వినలేదని అన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం బీజేపీకి ఆయువుగా మారిందని, కాంగ్రెస్ నేతలు ఎవరి మాట వింటారో అర్థం కావట్లేదని, సొంత తప్పుల కారణంగానే ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతోందని అన్నారు.

ఫలితాల అనంతరం పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే బీజేపీకి స్వర్ణయుగం వచ్చినట్టేనని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై నిప్పుల వర్షం కురిపించిన మమతా బెనర్జీ, నెమలి పింఛాలను పెట్టుకున్న బొద్దింకలు, తాము నెమ్మళ్లైపోయినట్టు కలగంటున్నాయని, వారి కలలను 2019 పార్లమెంట్ ఎన్నికలు కల్లలుగా మారుస్తాయని అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ధనబలంతోనే బీజేపీ గెలిచిందని ఆమె అన్నారు. త్రిపురలో అధికారంలోని వామపక్ష పార్టీకి, బీజేపీ కూటమికి 5 శాతం మాత్రమే ఓట్ల తేడా వచ్చిందని, అంతమాత్రానికే గొప్పలకు పోవడం ఎందుకని ఎద్దేవా చేశారు.

More Telugu News