KCR: థర్డ్ ఫ్రంట్ వస్తుంది... నేనే ముందుంటా, చంద్రబాబుతోనూ మాట్లాడతా!: సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్

  • కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
  • రెండు పార్టీలూ రాజకీయ వ్యవస్థను దెబ్బతీశాయి
  • ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ రావాల్సిందే
  • ఇప్పటికే సీతారాం ఏచూరితో మాట్లాడానన్న కేసీఆర్

ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో కాంగ్రెస్ పార్టీ స్థానంలో బీజేపీ వచ్చినంత మాత్రాన ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఈ రెండు పార్టీలూ దేశ రాజకీయ వ్యవస్థను దారుణంగా దెబ్బతీశాయని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన, దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, అందుకు తానే నడుం బిగిస్తానని, బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ కలుస్తానని ఆయన స్పష్టం చేశారు.

దేశాన్ని మార్చేందుకు కావాల్సిన మూడో ఫ్రంట్ కు నాయకత్వం వహించాల్సి వస్తే తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఇండియాలో రెండు ప్రధాన పార్టీలు కాకుండా ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, అవన్నీ కలిస్తే మార్పు సాధ్యమని వ్యాఖ్యానించిన ఆయన, చంద్రబాబును కలిసేందుకూ తాను సిద్ధమని అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరితో మాట్లాడానని తెలిపారు. తన మీడియా సమావేశంలో దివంగత ఎన్టీఆర్ ను తలచుకున్న కేసీఆర్, తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారం ఎన్టీఆర్ చేతికి వచ్చిందని, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తరువాత 60 రోజుల్లోనే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిందని కేసీఆర్ గుర్తు చేశారు.

More Telugu News