kvp: ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే చంద్రబాబు కొత్త డ్రామాలు: కేవీపీ బహిరంగ లేఖ

  • పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్ర ప్రదేశ్ కు జీవనాడి
  • మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు
  • తప్పు అంతా కేంద్రంపై వేసి సానుభూతి పొందాలనుకుంటున్నారు
  • ఇప్పటికైనా స్వార్ధం విడిచిపెట్టండి

పోలవరం విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియ చెప్పాలని తాను మళ్లీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి బహిరంగ లేఖ రాస్తున్నానని కాంగ్రెస్ సీనియర్‌ నేత కేవీపీ రామచందర్‌రావు అన్నారు. "పోలవరంను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి.. దీన్ని కేంద్రమే ఎక్ప్ పీడియంట్ పబ్లిక్ ఇంటరెస్ట్ ప్రాజెక్ట్ గా త్వరితగతిన పూర్తి చేయాలని యూపీఏ ప్రభుత్వం చట్టం చేసింది. 02.03.2014న యూపీఏ కేబినెట్ తెలంగాణలోని 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. 01.05.2014 న యూపీఏ కేబినెట్ మీటింగ్ లో పోలవరం పూర్తి ఖర్చును అంటే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం అదనంగా పడే భారంతో పాటు, ప్రాజెక్ట్ పై కాస్ట్ ఎస్క్ లేషన్స్ సహా ప్రస్తుత రేట్ల ప్రకారం కేంద్రమే భరించాలని తీర్మానించింది.

యూపీఏ కేబినెట్ తీర్మానం ప్రకారం కేవలం పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పాటు చేయగానే.. పోలవరం అంతా కేంద్ర పరిధికిలోకి వెళ్లింది. అయితే, అధికారం లేకపోయినా, జూన్ 2015 లో చంద్రబాబు ప్రాజెక్ట్ నుండి ఇందిరా గాంధీ పేరు తొలగించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పనులు చేపట్టటానికి రాష్ట్రం సహకరించలేదు. కానీ ఇప్పుడు కాంట్రాక్టర్ల మార్పిడి, పంపకాలలో తేడా వల్ల టీడీపీ- బీజేపీ ఒకరిపైఒకరు నిందలు వేసుకోవడం వల్ల వాస్తవాలు బయటకు వచ్చాయి.

కాంట్రాక్టర్లు తన చేతిలో ఉండాలనే కక్కుర్తితో చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సహకరించకూడదని తన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం తన చేతి నుండి పోకూడదని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నించారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ప్రాజెక్ట్ నిర్మాణం రాష్ట్రం చేతికి రాకపోతే కాంట్రాక్టర్ లకు మేలు చేయాలని, వారికి లాభాలు తగ్గకూడదని.. ఫిబ్రవరి 2015లో జీవో 22 విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతోన్న పరిణామాల వల్ల అంతిమంగా నష్టపోయేది ఆంధ్ర ప్రజలే గానీ చంద్రబాబుకు గాని, మోదీ, జైట్లీ  గానీ కాదు.

ఈ ప్రాజెక్ట్ రాష్ట్రం చేతులలోకి రావడం వెనుక ఇన్ని లొసుగులు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ వివరాలపై శ్వేతపత్రం ప్రకటించడానికి జంకారని స్పష్టంగా అర్ధం అవుతుంది. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన సీమాంధ్ర ప్రజల పట్ల సానుభూతి కురిపిస్తూ, వారికి జరిగిన అన్యాయాన్ని సరిచేస్తామని కబుర్లు చెప్పిన మోదీని, చంద్రబాబును సీమాంధ్ర ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే.. నమ్మించి మీరు ప్రజల గొంతు కోశారు.

ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, మళ్లీ ప్రజలను మోసం చేయాలని, విభజన హామీలు నెరవేర్చని తప్పు అంతా కేంద్రంపై, బీజేపీపై వేసి ప్రజల సానుభూతి పొందాలని చంద్రబాబు కొత్త అవతారం ఎత్తారు. ఇప్పటికైనా స్వార్థం విడిచిపెట్టి.. పోలవరం విషయంలో ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం భరించవలసినదేనని లిఖితపూర్వకంగా కోరి, అదే విషయాన్ని కోర్టులో చెప్పి మీ పాపాలకు కొంతమేరకైనా ప్రాయశ్చిత్తం చేసుకొంటారని ఆశిస్తున్నాను" అని కేవీపీ లేఖలో రాశారు. 

More Telugu News