Nalapad: దాడి కేసులో కర్ణాటక ఎంఎల్ఏ కుమారుడికి బెయిల్ నిరాకరణ

  • ఇది న్యాయానికి దక్కిన విజయమన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్
  • నిందితులకు ఈ నెల 7 వరకు జుడీషియల్ కస్టడీ
  • నలపద్‌పై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ వేటు విధించిన కాంగ్రెస్

దాడి కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎంఎల్ఏ ఎన్ఏ హ్యారిస్ తనయుడు మహ్మద్ హ్యారిస్ నలపద్‌‌కు బెయిల్ మంజూరు చేయడానికి ఓ బెంగళూరు కోర్టు తిరస్కరించింది. ఆయనతో పాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఆరుగురికి కూడా బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పేసింది. ఫిబ్రవరి 17న ఓ రెస్టారెంట్‍‌లో ఓ వ్యక్తిని చితక్కొట్టిన కేసులో నలపద్‌‌తో పాటు ఇతర నిందితులు అదే నెల 21 నుంచి జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. "సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశముందని, కేసు దర్యాప్తు నీరుగారిపోవచ్చని కోర్టు భావించింది. అందుకే నిందితులకు బెయిల్‌ నిరాకరించింది. మొత్తంగా ఇది న్యాయానికి, సమాజానికి దక్కిన విజయం" అని ప్రభుత్వ న్యాయవాది మీడియాతో అన్నారు.

కాగా, బెంగళూరు నగరంలోని యూబీ సిటీలో ఉన్న ఓ పబ్‌లో ఓ వ్యక్తిపై తాము దాడి చేసిన మాట నిజమేనని నిందితులు అంగీకరించడంతో కోర్టు వారిని ఈ నెల 7 వరకు జుడీషియల్ కస్టడీకి ఆదేశించిన సంగతి విదితమే. మరోవైపు బెంగళూరు నగర యువ కాంగ్రెస్ విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నలపద్‌ని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన నలపద్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

More Telugu News