Chandrababu: చంద్రబాబుతో సమావేశంలో ఎంపీలు తేల్చి చెప్పిందిదే!

  • ప్రజల్లో వెంటనే ఆగ్రహాన్ని తగ్గించాలన్న సీఎం రమేష్
  • తుది నిర్ణయం చంద్రబాబే తీసుకోవాలన్న ఎంపీలు
  • హామీలు నెరవేరేంత వరకూ పోరాడదామన్న జయదేవ్
  • ఎప్పుడు ఏం చేయాలో చంద్రబాబుకు తెలుసునన్న టీజీ

ఈ ఉదయం చంద్రబాబుతో సమావేశమైన తెలుగుదేశం పార్టీ ఎంపీలు, విభజన హామీల అమలుపై చర్చిస్తూ, ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని వెంటనే తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖపట్నానికి రైల్వే జోన్ వంటి కీలకమైన హామీల అమలుపై మూడున్నరేళ్లు దాటుతున్నా, కేంద్రం స్పందించని వైనాన్ని ప్రస్తావిస్తూ, కేంద్ర మంత్రులు, ఎంపీల రాజీనామా, అవిశ్వాసం పెట్టడం వంటి అంశాలను పరిశీలించాలని తమ అధినేతను కోరారు. బీజేపీతో దోస్తీపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది మీరేనని చంద్రబాబుకు చెప్పిన ఎంపీ సీఎం రమేష్, పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి తామంతా కట్టుబడి వుంటామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని, తుది అస్త్రంగా అవిశ్వాస తీర్మానం పెడదామని ఆయన అన్నట్టు సమాచారం.

మరో ఎంపీ గల్లా జయదేవ్ స్పందిస్తూ, ఏపీకి రావాల్సిన వాటా వచ్చేంత వరకూ పోరాడదామని వ్యాఖ్యానించారు. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, అధినేత చంద్రబాబునాయుడు అనుభవజ్ఞుడని, ఆయనకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసునని అన్నారు. రాష్ట్రానికి ఏం చేయాలన్నా అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్న కేశినేని నాని, కాంగ్రెస్, వామపక్షాలు వీధి పోరాటాలు చేస్తున్నాయని, వాటితో ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రంపై మరింత ఒత్తిడి తెద్దామని, బడ్జెట్ సమావేశాల్లో నిరసనలు కొనసాగిద్దామని సూచించారు. పవన్ కల్యాణ్ జేఎఫ్సీతోనూ ఎటువంటి లాభమూ లేదని ఆయన అన్నట్టు తెలుస్తోంది. నిజా నిజాలను ప్రజలే నిర్ధారిస్తారని, అందుకోసం ఎవరూ అక్కర్లేదని నాని వ్యాఖ్యానించినట్టు సమాచారం.

More Telugu News