Telangana: ఎన్ కౌంటర్ మృతుల్లో తెలంగాణ సీనియర్ మావోయిస్ట్ హరిభూషణ్... 20కి పెరిగిన మృతుల సంఖ్య!

  • కొనసాగుతున్న ఎన్ కౌంటర్
  • తెలంగాణ మావోయిస్ట్ కార్యదర్శిగా హరిభూషణ్
  • గాయపడిన పోలీసులు ఆసుపత్రికి తరలింపు
  • ఘటనా స్థలికి చాపర్లలో అదనపు బలగాలు

ఛత్తీస్ గడ్ కు సమీపంలోని తడపలగుట్ట, పూజారి కాంకేడు అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు జరిపిన భారీ ఎన్ కౌంటర్ లో సీనియర్ మావోయిస్టు హరిభూషణ్ ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం మావోయిస్టుల్లో చేరిన హరిభూషణ్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన మృతిని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించాల్సి వుంది.

కాగా, ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన వారి సంఖ్య 20కి పెరిగింది. మృతుల్లో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారని సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మృతుల్లో పలువురిని గుర్తించాల్సి వుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయని, వారికి చికిత్స చేయిస్తున్నామని చెప్పారు.

ఘటనా స్థలి నుంచి ఏకే-47 తుపాకులను సైతం స్వాధీనం చేసుకున్నామని, ఈ ప్రాంతంలో దాగిన మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. హెలికాప్టర్లలో అదనపు బలగాలను ఆ ప్రాంతానికి తరలించిన అధికారులు, కూంబింగ్ పరిధిని మరింతగా పెంచారు.

More Telugu News