Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు నివేదిక అందజేసిన జేఎఫ్‌సీ!

  • పవన్ కల్యాణ్ చొరవతో ఏర్పాటైన సంయుక్త నిజనిర్ధారణ కమిటీ
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన లెక్కలపై పరిశోధన 
  • ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదని నివేదిక

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేసిన సాయంపై నివేదిక అందించేందుకు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ చొరవతో సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ) ఏర్పాటైన విషయం తెలిసిందే. ఆ కమిటీ సభ్యులు ఈ రోజు పవన్ కల్యాణ్‌కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.

 రాష్ట్ర ప్రభుత్వం అడిగిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని నివేదిక తేల్చింది. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం తమ మాటను నిలబెట్టుకోలేదని జేఎఫ్‌సీ రిపోర్టులో పొందుపరిచినట్టు సమాచారం. ఈ నివేదికలోని పూర్తి వివరాలను ఎల్లుండి విడుదల చేయనున్నారు.

కాగా, ఈ రోజు హైదరాబాద్‌లో జేఎఫ్‌సీ నివేదికపై సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, లోక్ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ అధికారి తోట చంద్రశేఖర్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికను ప్రజలకు ఎలా వివరించాలనే విషయంపై చర్చలు జరిపారు.    

More Telugu News