German: డీజిల్ కార్ల నిషేధాన్ని సమర్థించిన జర్మనీ కోర్టు.. కంగుతిన్న ఆటోమొబైల్ కంపెనీలు

  • డీజిల్ వాహనాలపై నిషేధం విధించుకోవచ్చు
  • నగర, మున్సిపాలిటీల అధికారులకు కోర్టు గ్రీన్ సిగ్నల్
  • షాక్ తిన్న యజమానులు, ఆటో కంపెనీలు

వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు డీజీల్ కార్లపై నగరాలు నిషేధం విధించవచ్చని జర్మనీలోని ఓ అత్యున్నత కోర్టు తీర్పును వెలువరించింది. గాలి స్వచ్ఛతను కాపాడటం కోసం పాత, సరైన కండిషన్ లో లేని వాహనాలను స్థానిక అధికారులు బ్యాన్ చేయవచ్చని లీప్ జిగ్ లోని ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు తెలిపింది. కోర్టు నిర్ణయంతో ఇన్నర్ సిటీలలోని వాహనాల యజమానులతో పాటు, ఆటో ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడనుంది.

డీజిల్ కార్లపై తనంతట తాను కోర్టు నిషేధం విధించనప్పటికీ... నిషేధం విధించే అధికారం స్థానిక నగర, మునిసిపల్ అధికారులకు ఉంటుందని స్పష్టం చేసింది. కొన్ని మినహాయింపులతో బ్యాన్ ను అమలు చేయవచ్చని... క్రమంగా ఆటంకాలన్నింటినీ తొలగించుకోవాలని సూచించింది. కోర్టు తీర్పుతో ఆటోమొబైల్ కంపెనీలు షాక్ తిన్నాయి. తమ వాహనాలకు విలువ లేకుండా పోతుందని డీజిల్ వాహనాల ఓనర్లు లబోదిబోమంటున్నారు.

కోర్టు తీర్పుపై జర్మనీ ఛాన్సెల్లర్ ఏంజెలా మెర్కెల్ కూడా స్పందించారు. తీర్పు మొత్తం దేశానికి వర్తించదని... ఏ నగరమైనా లేదా మున్సిపాలిటీ అయినా దేనికది నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. మరోవైపు కోర్టు తీర్పు పట్ల పర్యావరణ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News