Narendra Modi: ఈ పోరాటాన్ని... ఇస్లాంకు వ్యతిరేకంగా చేస్తున్నట్టు భావించరాదు: నరేంద్రమోదీ

  • ఇస్లామిక్ హెరిటేజ్ కాన్ఫరెన్స్ కు హాజరైన మోదీ, కింగ్ అబ్దుల్లా
  • ఇస్లాం బోధిస్తున్న మానవత్వాన్ని అర్థం చేసుకోవాలన్న మోదీ
  • దేవుడి పేరుతో జనాలను విడగొట్టడం దారుణమన్న అబ్దుల్లా

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని... ఇస్లాంకు కానీ, మరే ఇతర మతానికి కానీ వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంగా భావించరాదని ప్రధాని మోదీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా అన్నారు. అమాయక యువతను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై చేస్తున్న పోరాటం ఇది అని తెలిపారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు భారత్, జోర్డాన్ లు కలసి పని చేస్తాయని చెప్పారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఇస్లాం మతం బోధిస్తున్నటువంటి మానవత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని తెలిపారు. ప్రతి మతం కూడా మానవ విలువలను బోధిస్తుందని చెప్పారు. ప్రపంచంలోని అన్ని మతాలకు భారత్ ఒక ఊయలలాంటిదని ఈ సందర్భంగా మోదీ అన్నారు. 'ఇస్లామిక్ హెరిటేజ్: ప్రమోటింగ్ అండర్ స్టాండింగ్ అండ్ మోడరేషన్' సదస్సు సందర్భంగా మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కాన్ఫరెన్స్ కు కింగ్ అబ్దుల్లా కూడా హాజరయ్యారు.

కింగ్ అబ్దుల్లా మాట్లాడుతూ, ప్రతిరోజూ మనం వింటున్న వార్తలు, మన చుట్టూ జరుగుతున్న విషయాలను చూస్తుంటే... మతం పేరుతో మనుషులను వేరు చేస్తున్నట్టు అర్థమవుతుందని అన్నారు. వర్గవైషమ్యాలను రెచ్చగొడుతున్న వారికి ఇతరుల గురించి ఏమీ తెలియదని మండిపడ్డారు. దేవుడి పేరుతో జనాలను విడగొట్టాలనుకోవడం దారుణమని అన్నారు. టెర్రరిజంపై పోరు అనేది మతాల మధ్య పోరాటం కాదని చెప్పారు. ఇస్లాం అంటే రాడికల్ భావజాలం కాదని అన్నారు. మానవత్వం అన్ని మతాలను ఒకటి చేస్తుందని చెప్పారు. భారత్, జోర్డాన్ ల మధ్య బంధాలు మరింత బలపడతాయని తెలిపారు. రెండోసారి భారత్ కు రావడాన్ని తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.

More Telugu News