Mumbai: పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న శ్రీదేవి!

  • అంతిమయాత్రలో 25 వేల మంది అభిమానులు
  • కిక్కిరిసిన రోడ్లు.. తొక్కిసలాట భయంతో పోలీసులు అప్రమత్తం
  • అంత్యక్రియలకు ముందు సంగీతంతో పోలీస్ బ్యాండ్ గౌరవ వందనం

అశేష అభిమానులను శోకసంద్రంలో ముంచి కానరాని లోకాలకు తరలిపోయిన సినీ నటి శ్రీదేవి పార్థివదేహానికి బుధవారం అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులతోపాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దిగ్గజ నటి అంతిమయాత్రలో పాల్గొన్న వారితో ముంబై రోడ్లు కిక్కిరిసిపోయాయి. మొత్తం 25 వేల మంది అంతిమయాత్రలో పాల్గొన్నట్టు అంచనా.

అంధేరిలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్ నుంచి జుహు వరకు సాగిన అంతిమయాత్ర అభిమానులతో కిక్కిరిసిపోయింది. రోడ్లకిరువైపులా నిల్చుని శ్రీదేవికి తుది వీడ్కోలు చెబుతూ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషీతో కలిసి బోనీ కపూర్ శ్రీదేవి చితికి నిప్పంటించారు.

రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ బ్యాండ్ సంగీతంతో నివాళి అర్పించింది. పద్మశ్రీ అవార్డు గ్రహీతలలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవాన్ని శ్రీదేవి సొంతం చేసుకున్నారు. కాగా, శ్రీదేవిని కడసారి చూసేందుకు రోడ్లకు ఇరువైలా ఉన్న భవంతులపైకి అభిమానులు చేరుకోవడం పోలీసులను ఆందోళనకు గురిచేసింది. అభిమానులు వేలాదిగా తరలిరావడంతో తొక్కిసలాట ఎక్కడ జరుగుతుందోనని పోలీసులు భయపడ్డారు. దీంతో శ్రీదేవి కుటుంబ సభ్యులకు చెందిన 12 కార్లను మాత్రమే అంతిమయాత్రకు పోలీసులు అనుమతించారు.

More Telugu News