Kanchi Seer: కంచి స్వామి జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశ క్రతువు సాగుతోందిలా!

  • శాస్త్రోక్తంగా సాగుతున్న జయేంద్ర సరస్వతి మహా సమాధి క్రతువు
  • ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న శంకర విజయేంద్ర సరస్వతి
  • కన్నీరుమున్నీరవుతున్న భక్తులు
  • వెదురు బుట్టలో ఉంచి లాంఛనంగా కపాలమోక్షం

నిన్న అనారోగ్య కారణాలతో పరమపదించిన కంచి కామకోటి పీఠం 69వ అధిపతి జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం శాస్త్రోక్తంగా జరుగుతోంది. మహాస్వామి బృందావనం పక్కనే జయేంద్ర సరస్వతి మహా సమాధిని కంచి పీఠం నిర్మిస్తోంది. మహాసమాధికి ముందు, జగద్గురువును తన ఆసనంపై కూర్చున్న భంగిమలో ఉంచి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఆదిశంకరాచార్యుల తరువాత కైలాస మానస సరోవరానినకి వెళ్లిన ఏకైక శంకరాచార్యగా నిలిచిన జయేంద్ర సరస్వతి పార్థివదేహాన్ని వెదురు బుట్టలో ఉంచి లాంఛనంగా కపాలమోక్షం కార్యక్రమాన్ని పూజారులు జరిపించారు. జయేంద్ర సరస్వతి శివైక్యంపై కన్నీరుమున్నీరవుతున్న భక్తులు, అశ్రునయనాల మధ్యే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

 కంచి పీఠం గురుపరంపరలో ఎంతో మంది శిష్యులను తయారు చేసుకున్న జయేంద్ర సరస్వతి మహాసమాధి క్రతువును తదుపరి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి దగ్గరుండి నిర్వహించారు. ఆయనకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలగాలంటూ ప్రత్యేక మంత్రాలు చదివారు. నమక, చమక, శ్రీసూక్త, పురుష సూక్తాలను పఠించారు. పుణ్యాహవాచనం, అభిషేకం అనంతరం ఆయన పార్థివదేహాన్ని మహాసమాధిలోకి పంపే ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ క్రతువు దాదాపు 4 గంటలకు పైగా సాగనుంది.

More Telugu News