India: జీతాల పెంపులో భారత్ టాప్

  • 9.4 శాతం మేర ఉద్యోగుల జీతాల పెంచిన ఇండియా
  • 6.7 శాతంతో రెండో స్థానంలో చైనా
  • ఈ ఏడాది ఇదే ఒరవడి కొనసాగవచ్చని సర్వే సంస్థ అంచనా

జీతాల పెంపు పరంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 2018లో అపాక్ (ఆసియా పసిఫిక్) దేశాలన్నింటిలోనూ భారత్ అత్యధికంగా 9.4 శాతం మేర ఉద్యోగుల జీతాలను పెంచిందని ఏఓఎన్ ఇండియా తాజాగా చేపట్టిన శాలరీ ఇంక్రీజ్ సర్వే వెల్లడించింది. భారత్ తర్వాత రెండో స్థానంలో చైనా నిలిచింది. ఈ కమ్యూనిస్టు దేశం జీతాలను 6.7 శాతం మేర పెంచింది. 20 పరిశ్రమలకు చెందిన దాదాపు 1000 కంపెనీలపై సర్వే చేపట్టారు. సర్వే డేటా ప్రకారం, భారత్‌లోని కంపెనీలు గతేడాది సగటున 9.3 శాతం మేర జీతాలను పెంచాయి. కానీ అంతకుముందు ఉద్యోగులకు ఇస్తున్న రెండంకెల పెంపుతో పోల్చితే ఇది తక్కువ కావడం గమనార్హం.

గత ఆర్థిక సంవత్సరంలో మాదిరిగానే ఈ ఏడాదిలోనూ జీతాల పెంపు ఒరవడి ఇదే రీతిలో కొనసాగవచ్చని అంచనా. ఇందుకు కారణం...కంపెనీలు చెల్లింపుల బడ్జెట్‌ల రూపకల్పన విషయంలో ప్రదర్శిస్తున్న దూరదృష్టేనని ఏఓఎన్ ఇండియా భాగస్వాముల్లో ఒకరైన ఆనందోరూప్ ఘోస్ అభిప్రాయపడ్డారు. మరోవైపు కంపెనీ పరిమాణం, ఉప పరిశ్రమలోని వ్యాపార స్థితిగతులు, మేధో అవసరాల పరిస్థితి, పనితీరు లాంటి కారణాల వల్ల కంపెనీలు జీతాలు పెంచుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఆయన చెప్పారు.

అన్ని రంగాలు, కంపెనీల ఉద్యోగుల పనితీరుపై ఎక్కువగా దృష్టి సారిస్తుండటం ఏటా పెరుగుతూ వస్తోందని, అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్న ఉద్యోగులు సగటున 15.4 శాతం మేర పెంపును అందుకుంటున్నారని ఆయన చెప్పారు. సగటు పనితీరు కలిగి ఉన్న ఉద్యోగికి ఇచ్చే పెంపుతో పోల్చితే ఇది 1.9 శాతం అధికంగా ఉంది. కాగా, భారత్‌లో ఉద్యోగుల జీతాల పెంపుల్లో కోతల రేటు అంతకుముందు దశాబ్దంలో ఉన్న 20 శాతం నుంచి గతేడాది 15.9 శాతానికి తగ్గింది.

More Telugu News