Karti Chidambaram: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంకు షాక్.. కుమారుడు కార్తీ అరెస్ట్!

  • చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
  • లండన్ నుంచి వస్తూ, ల్యాండ్ అయన వెంటనే అరెస్ట్
  • ఐఎన్ఎక్స్ మీడియా స్కాంలో అరెస్ట్

కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి చిదంబరంకు షాక్ తగిలింది. ఈ ఉదయం ఆయన కుమారుడు కార్తీ చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసు నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయనను... చెన్నై ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేసి, తమ కార్యాలయానికి తరలించారు. సీబీఐ ఇన్వెస్టిగేషన్ కు సరిగ్గా సహకరించని నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ జరిగినట్టు సమాచారం. ఆయనను ఢిల్లీకి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, కార్తీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరరామన్ ను ఢిల్లీ కోర్టు సోమవారం నాడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ఈడీ అధికారులు భాస్కరరామన్ ను కోర్టులో ప్రవేశపెట్టగా... స్పెషల్ జడ్జ్ ఎన్కే మల్హోత్రా ఆయనను కస్టడీకి తరలిస్తూ తీర్పును వెలువరించారు. వెంటనే అక్కడ నుంచి ఆయనను తీహార్ జైలుకు పోలీసులు తరలించారు. ఫిబ్రవరి 16న ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ లో భాస్కరరామన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

యూపీఏ హయాంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్ఎక్స్ మీడియా స్కాం చోటు చేసుకుంది. 2007లో ఐఎన్ఎక్స్ మీడియా నిధులు పొందేందుకు వీలుగా ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎప్ఐపీబీ) అనుమతులు మంజూరు చేసింది. ఈ కేసు నేపథ్యంలోనే నేడు కార్తీ అరెస్ట్ చోటు చేసుకుంది.

More Telugu News