Kadapa District: యువతిపై అఘాయిత్యం.. అధికారం పేరు చెప్పి బెదిరింపులు!

  • దుస్తుల కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లిన యువతి 
  • బాధితురాలిని బలవంతంగా లొంగ దీసుకున్న ఆప్కో చైర్మన్‌ గుజ్జల శ్రీనివాస్ తండ్రి రామకృష్ణ
  • ఆ దృశ్యాల వీడియోను యూట్యూబ్ లో పెడతానంటూ బ్లాక్ మెయిల్

ఉద్యోగం కోసం వెళ్లిన తనను శారీరకంగా లొంగదీసుకోవడమే కాకుండా, పలువురి వద్దకు పంపి వేధింపులకు పాల్పడుతున్న ఏపీ ఆప్కో ఛైర్మన్ శ్రీనివాస్ తండ్రి రామకృష్ణ (65) దురాగతాన్ని బాధితురాలు హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా ప్రతినిధులకు వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళ్తే... కడపజిల్లాకు చెందిన సదరు యువతి తల్లిదండ్రులు చనిపోవడంతో, ఐదు నెలల నుంచి కడపలోనే లేడీస్‌ హాస్టల్‌ లో ఉంటూ ఒక ఆసుపత్రిలో పని చేస్తుండగా, ఖాజీపేటకు చెందిన సీఆర్‌ పాషా, ఖదీరుల్లాతో ఆమెకు పరిచయం ఏర్పడింది.

వారు ఆప్కో చైర్మన్‌ గుజ్జల శ్రీనివాస్ తండ్రి గుజ్జల రామకృష్ణతో చెప్పి దుస్తుల కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని, మంచి జీతం వస్తుందని చెప్పి, ఆయన వద్దకు తీసుకెళ్లారని తెలిపింది. ఆ సమయంలో మైనార్టీ కార్పొరేషన్‌ నుంచి కుట్టుమిషన్‌ ఇప్పిస్తానని, అలాగే తన కుమారుడు చైర్మన్‌ గా ఉన్న ఆప్కోలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలిపింది. పెద్దాయన మంచి చేస్తున్నారని నమ్మిన తనను, మాయమాటలు చెప్పి, ఒక ఇంట్లోకి తీసుకెళ్లి బలాత్కారం చేశాడని బాధితురాలు కంట తడిపెట్టుకుంది. కూతురిలాంటిదాన్నని ఎంత వేడుకున్నా వదల్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ దృశ్యాలను రహస్యంగా వీడియో తీశానని, నగ్నవీడియోలు యూట్యూబ్ లో పెడతానని బెదిరించి, ఆ తర్వాత కూడా పలుమార్లు తనను అనుభవించాడని ఆమె తెలిపింది. అంతేకాకుండా పలువురి వద్దకు తనను పంపాడని కూడా వెల్లడించింది. ఆ వేధింపులు భరించలేక నాలుగుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశానని ఆమె చెప్పింది.

మరో ఆడపిల్ల ఇలా బలికాకూడదని కడప వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. ఆ స్టేషన్ ఏఎస్‌ఐ తనను దుర్భాషలాడాడని, తెల్ల కాగితంపై తన సంతకం తీసుకుని, '50 వేల రూపాయలిస్తాం నోరుమూసుకుని వెళ్లిపో'వాలని హెచ్చరించాడని ఆమె తెలిపింది. ఆ తరువాత రామకృష్ణ 'ఇక్కడ మా ప్రభుత్వమే అధికారంలో ఉంది...ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో' అంటూ చీదరించాడని, తన జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గులకు శిక్ష పడాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలను ఆమె మీడియా ప్రతినిధులకు ఇచ్చింది.

More Telugu News