pm modi: ప్రధాని మన్ కీ బాత్ విశేషాలు... విశిష్ట సేవలు అందించిన రియల్ హీరోలకు అభినందనలు

  • ఎంతో మంది శాస్త్రవేత్తల పురిటి గడ్డ ఇది
  • పేదల అభివృద్ధికి టెక్నాలజీ కృత్రిమ మేధ అవసరం
  • సమాజ విలువలను పాటించాలి
  • నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను నివారించాలి

ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీబాత్ కార్యక్రమం ద్వారా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి ఈ రోజు మాట్లాడారు. ‘‘భారత దేశం ఎంతో మంది శాస్త్రవేత్తలకు నిలయం. గొప్ప గణిత శాస్త్రజ్ఞులు బౌధాయణ, భాస్కర, బ్రహ్మగుప్త, ఆర్యభట్టలకు నిలయం భారత్. మరోవైపు శుశృతుడు, చరకుడు వైద్య రంగంలో మనకు గర్వకారణం. సర్ జగదీష్ చంద్రబోస్, హరగోవింద్ ఖురానా, సత్యేంద్ర నాథ్ బోస్ వీరంతా గొప్ప శాస్త్రవేత్తలు’’ అంటూ భారత శాస్త్రరంగంలో విశిష్ట వ్యక్తుల సేవలు అందించిన వారి సేవల్ని గుర్తు చేశారు.

టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ)ను పేదలు, నిరుపేదల సంక్షేమానికి వినియోగించుకోవాలని ప్రధాని సూచించారు. ‘‘జాతీయ విపత్తులు మినహా చాలా వరకు ప్రమాదాలు మన నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. మనం అప్రమత్తతతో ఉండి, నిబంధనలను పాటించడం ద్వారా వీటిని నివారించొచ్చు’’ అని ప్రధాని పేర్కొన్నారు.

ఏదైనా విపత్తు వచ్చిన తర్వాత సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం అక్కడికి చేరుకునే వారే నిజమైన హీరోలని కొనియాడారు. ‘‘మనం విలువ పరిరక్షణ గురించి మాట్లాడుతుంటాం. కానీ, సమాజ విలువలను కూడా మనం అర్థం చేసుకుని, వాటిని జీవితంలో భాగం చేసుకోవాలి’’ అని సూచించారు. దేశ ప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News