angarag papan mahantaa: తప్పైతే క్షమించండి... తప్పుడు ఆలోచనతో ముద్దుపెట్టలేదు... 'చిన్నారికి ముద్దు'పై స్పందించిన సింగ‌ర్‌

  • ఇండియా కిడ్స్‌ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన అంగారగ్ పపొన్ మహంత
  • హోలీ ఎపిసోడ్ అనంతరం మైనర్ బాలిక ముఖానికి రంగురుద్ది పెదాలపై ముద్దు
  • సోషల్ మీడియాలో పపొన్ ను దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

11 ఏళ్ల చిన్నారి పెదాలపై పెట్టిన ముద్దు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపడంతో అసోం గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ అంగారగ్ పపొన్ మహంత బహిరంగ లేఖ ద్వారా వివరణ ఇచ్చాడు. తానెలాంటి తప్పు చేయలేదని అన్నాడు. 14 ఏళ్ల క్రితం పెళ్లైన తనకు ఇద్ద‌రు పిల్ల‌లున్నారని తెలిపాడు. ఏ విష‌యాన్నైనా ఓపెన్‌ గా ఎక్స్‌ ప్రెస్ చేయ‌డం తనకు అల‌వాటని, అలాగే తాను పాపకు ముద్దుపెట్టాను తప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేదని అన్నాడు. ఒక‌వేళ తన మ‌న‌సులో ఏదైనా దురుద్దేశం ఉంటే ఆ వీడియోని ఫేస్‌ బుక్‌ లో ఎందుకు పెడ‌తానని ప్రశ్నించాడు.

తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని న‌మ్ముతున్నానని, ఒకవేళ ముద్దుపెట్ట‌డమే త‌ప్ప‌యితే మాత్రం తనను క్ష‌మించాలని విమర్శకులను పపొన్ కోరాడు. సోషల్ మీడియా ద్వారా చేసే విమ‌ర్శ‌లు రెండు కుటుంబాల‌లో చిచ్చుపెడ‌తాయని ఆందోళన వ్యక్తం చేశాడు. ద‌య‌చేసి ఓ అమాయ‌క చిన్నారి జీవితాన్ని నాశ‌నం చేయొద్దని ఆ బహిరంగ లేఖలో ప‌పొన్ కోరాడు. దీనిపై బాలిక తండ్రి స్పందిస్తూ, ప‌పొన్ ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని అన్నారు. ఈ విష‌యంలో పపొన్ ని త‌ప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదని సూచించారు.

కాగా, ఇండియా కిడ్స్‌ ప్రోగ్రాంకి అంగారగ్ పపొన్ మహంత న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. దీంతో ఈ కార్యక్రమాన్ని తన ఫేస్ బుక్ పేజ్ లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టాడు. మెంటర్‌ గా ఉన్న అంగార‌గ్‌, హోలీ ఎపిసోడ్ అనంతరం ఓ బాలిక (11) ముఖానికి రంగురుద్ది పెదాలపై ముద్దాడాడు. దీనిని ఫేస్‌ బుక్‌ ప్రత్యక్ష ప్రసారంలో చూసిన వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది రునా భుయాన్‌ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో సింగర్ పపొన్‌ పై ఫిర్యాదు చేశారు. అతనిపై పోక్సో(POCSO) యాక్ట్‌ కింద లైంగిక దాడి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అంగార‌గ్ పపొన్ బహిరంగ లేఖ రాశాడు.       

More Telugu News