obc: ఓబీసీకి రూ.390 కోట్లకు టోపీ పెట్టిన ఆభరణాల సంస్థ!

  • విదేశీ క్రెడిట్ లెటర్స్ సాయంతో రుణాలు
  • పది నెలలుగా ఆచూకీ లేని కంపెనీ యజమానులు
  • ఓబీసీ ఫిర్యాదుతో కేసు దాఖలు చేసిన సీబీఐ

వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11,400 కోట్లకు మోసం చేసిన తరహాలోనే ఢిల్లీకి చెందిన ఓ బంగారం వర్తకుడు ఓరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (ఓబీసీ) కు రూ.390 కోట్ల మేర టోపీ పెట్టాడు. దీనిపై ఓబీసీ ఆరు నెలల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ సీబీఐ కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు నీరవ్ మోదీ షాక్ తో వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది.

ఢిల్లీలోని కరోల్ భాగ్ ప్రాంతానికి చెందిన ద్వారకాదాస్ సేత్ ఇంటర్నేషనల్ సంస్థ వజ్రాభరణాలు, బంగారు, వెండి ఆభరణాల తయారీ, విక్రయంలో ఉంది. ఓబీసీ గ్రేటర్ కైలాష్-2 శాఖ నుంచి ఈ సంస్థ విదేశీ క్రెడిట్ లెటర్స్ సాయంతో రూ.390 కోట్ల మేర రుణాలు పొందింది. ఈ కంపెనీని సభ్యసేత్, రీతాసేత్, క్రిషన్ కుమార్ సింగ్, రవి కుమార్ సింగ్ నిర్వహిస్తున్నారు. గత పది నెలలుగా వీరి ఆచూకీ లేదు. వారు బ్యాంకుకు ఇచ్చిన చిరునామాల్లో ఉండడం లేదు. దీంతో ఓబీసీ గతేడాది ఆగస్ట్ 16న సీబీఐని సంప్రదించింది. దీనిపై సీబీఐ శుక్రవారమే కేసు నమోదు చేయడం గమనార్హం.

More Telugu News