పుజారాకు ప్రమోషన్.. తండ్రి అయిన టీమిండియా నయావాల్

24-02-2018 Sat 07:58
  • పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పుజారా భార్య పూజ
  • ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఆనందం పంచుకున్న క్రికెటర్
  •  క్రికెటర్లు, నెటిజన్ల శుభాకాంక్షలు
టీమిండియా ఓపెనర్ చతేశ్వర్ పుజారాకు తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. పుజారా భార్య పూజ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ ఆనందాన్ని పుజారా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా పాపతో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేస్తూ.. ‘పాపకు స్వాగతం. జీవితంలో సరికొత్త పాత్రలు పోషించేందుకు సిద్ధమవుతున్నాం. మా కోరిక నెరవేరి మా జీవితంలోకి పాప వచ్చినందుకు ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చాడు.

తాను తండ్రిని కాబోతున్నట్టు జనవరి 1నే పుజారా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని పుజారా ప్రస్తుతం సౌరాష్ట్ర తరపున విజయ్ హాజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. ఐపీఎల్ సమయంలో ఖాళీగా ఉండకుండా యార్క్‌షైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లనున్నాడు. తండ్రి అయిన పుజారాకు క్రికెటర్లు, నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.