Telangana: ఓటుకు నోటు కేసులో కీలక మలుపు.. అప్రూవర్‌గా మారుతానంటూ సీజేకు జెరూసలెం మత్తయ్య లేఖ!

  • నన్ను ఉపయోగించుకుని చంద్రబాబును ఇరికించాలని చూస్తున్నారు
  • వాస్తవాలను బయటకు చెప్పే అవకాశం కల్పించండి
  • సుప్రీం సీజేకు రాసిన లేఖలో మత్తయ్య

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో ప్రధాన నిందితుడు జెరూసలెం మత్తయ్య సంచలన ప్రకటన చేశారు. తాను అప్రూవర్‌గా మారేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తనను హతమార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని లేఖలో కోరారు.

టీడీపీ, టీఆర్ఎస్‌లు తనను వేధిస్తున్నాయని, తనకు అప్రూవర్‌గా మారే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనను ఉపయోగించుకుని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఇరికించాలన్న ప్రయత్నం జరుగుతోందని అన్నారు. తనకు, ఈ కేసుకు ఎటువంటి సంబంధమూ లేదన్నారు. వాస్తవాలను బయటకు చెప్పే అవకాశం కల్పించాలని కోరారు.

 క్రైస్తవ సమస్యలపై మాట్లాడడానికే తాను స్టీఫెన్‌ను కలిశానని మత్తయ్య స్పష్టం చేశారు. కేసు హైకోర్టులో ఉన్నప్పుడు టీడీపీ తనకు సహకరించిందని, సుప్రీంకోర్టులో తనకు ఎవరూ సహకరించలేదని పేర్కొన్నారు. తనకు కేటీఆర్ ఫోన్ చేసిన సమయంలో ఆయనను ఇరికించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నించిందని పేర్కొన్న మత్తయ్య, ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ గురించి కొన్ని వాస్తవాలు బయటకు చెప్పాల్సి వుందని ఆ లేఖలో పేర్కొన్నారు.

More Telugu News