KCR: తెలంగాణ చేనేత కార్మికులకు తీపి కబురు.. రూ. లక్ష రుణమాఫీ.. మార్గదర్శకాల విడుదల!

  • మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
  • ఎంత తీసుకున్నా లక్ష మాఫీ
  • మిగిలిన రుణం చెల్లిస్తేనే రుణ మాఫీ 
  • 3757 మందికి లబ్ధి

తెలంగాణలోని చేనేత కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. లక్ష రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించింది. జనవరి 1, 2014 నుంచి మార్చి 31, 2017 మధ్య తీసుకున్న బ్యాంకు రుణాలకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేశారు.

రుణం ఎంతున్నా లక్ష రూపాయల వరకు బ్యాంకులు మాఫీ చేయనున్నాయి. లక్ష కంటే ఎక్కువ రుణం తీసుకున్నవారు మాఫీ పోగా మిగిలిన దాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే, తొలుత ఈ సొమ్మును చెల్లించిన తర్వాతే బ్యాంకులు రుణ మాఫీని పరిగణనలోకి తీసుకుంటాయి. దీంతోపాటు గతేడాది జూన్-సెప్టెంబరు మధ్య నేత కార్మికులు తీసుకున్న వ్యక్తిగత రుణాలను కూడా మాఫీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

నిజానికి ప్రభుత్వం గతేడాది నవంబరులోనే చేనేత కార్మికుల రుణమాఫీని ప్రకటించింది. అందులో భాగంగానే తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 1, 2014- మార్చి 31, 2017 మధ్య రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల నుంచి 3757 మంది కార్మికులు రూ.14.76 కోట్ల రుణాలు తీసుకున్నారు. వీరిలో 413 మంది కార్మికులు రూ.లక్షకు పైగా తీసుకున్నారు. వీరు తీసుకున్న రుణం రూ.8.21 కోట్లు.

అలాగే బ్యాంకులు నిరర్ధక ఆస్తుల కింద ప్రకటించిన ఖాతాలు 237 ఉన్నాయి. ఈ ఖాతాల కార్మికులు చెల్లించాల్సిన రుణం రూ.78 లక్షలు. ఒకవేళ జనవరి, 2014 నుంచి మార్చి, 2017 మధ్య రుణ చెల్లింపులు జరిగి ఉంటే ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వం చేనేత కార్మికులకు చెల్లించనుంది.

More Telugu News