మొబైల్‌ నెంబర్లు 10 అంకెల నుంచి 13 అంకెలకు మారవు: స్పష్టత ఇచ్చిన అధికారులు

21-02-2018 Wed 20:03
  • ఈ 13 నెంబర్లు కేవలం మెషిన్‌ టు మెషిన్‌ వినియోగదారులకు మాత్రమే 
  • కమ్యూనికేషన్‌కు సంబంధించి పలు కంపెనీలు ఎం2ఎంల వినియోగం
  • ఓడలు, విమానాలు, పలు రకాల కార్లు,  పీఓఎస్‌ యంత్రాల్లో ఉపయోగం ‌
  • వినియోగదారులు వాడుతోన్న సాధారణ మొబైల్ నంబర్లలో ఎటువంటి మార్పుల్లేవ్
మొబైల్ నెంబర్లు 10 అంకెలతో కాకుండా 13 అంకెలతో ఉండేలా భారత టెలికమ్యూనికేషన్ సంస్థ అన్ని టెలికాం ఆపరేటర్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు జాతీయ వార్త సంస్థలతో పాటు రాష్ట్ర మీడియాలోనూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఫోన్‌ నంబర్ల విషయంలో భద్రతను మరింత పెంచేందుకే ఇటువంటి ప్రయోగం చేస్తున్నట్లు అందరూ అనుకున్నారు. కానీ, ఈ ప్రచారం అసత్యమేనని తెలిసింది.

ఈ 13 నెంబర్ల మార్పు కేవలం మెషిన్‌ టు మెషిన్‌ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని టెలికాం శాఖ పేర్కొంది. కమ్యూనికేషన్‌కు సంబంధించి పలు కంపెనీలు ఎం2ఎంలను వినియోగిస్తాయి. ఓడలు, విమానాలు, పలు రకాల కార్లు, పీఓఎస్‌ యంత్రాల్లో వీటిని ఉపయోగిస్తారు. అంతేకానీ, సాధారణంగా వినియోగదారులు వాడుతోన్న మొబైల్ నంబర్లలో ఎటువంటి మార్పులు ఉండబోవని తెలిపింది.

ఈ 13 అంకెలుండే ఎం2ఎం కొత్త మొబైల్‌ నంబర్లను ఈ ఏడాది జులై 1 నుంచి అమలు చేయనున్నారు. అలాగే, ఇప్పటికే 10 అంకెల ఎం2ఎం మొబైల్‌ వినియోగదారుల నంబర్లు ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి మారతాయని స్పష్టత వచ్చింది. ఎం2ఎం పరికరాలు క్రెడిట్‌ కార్డు స్వైపింగ్‌ యంత్రాల్లాగా ఇంటర్నెట్‌ సహాయంతో పనిచేస్తాయి. వినియోగదారుడు ఏదైనా లావాదేవీ జరిపితే మొబైల్ నెంబరు నుంచి బ్యాంకు సర్వర్‌కు అంతర్జాలం ద్వారా అది నమోదు అవుతుంది.  ఈ నెంబర్లు మాత్రమే 13కి పెరగనున్నాయి.