Team India: ముక్కోణపు టీ-20 సిరీస్ : భారత్-లంక మధ్య తొలి మ్యాచ్

  • మార్చి 6 నుంచి 18 వరకు మ్యాచ్‌లు
  • రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహణ
  • మార్చి 18న తుది సమరం

శ్రీలంక వేదికగా వచ్చే నెల 6 నుంచి 18 వరకు ముక్కోణపు టీ-20 సిరీస్ జరగనుంది. శ్రీలంక-భారత్-బంగ్లాదేశ్ జట్లు ఈ నిదాన్ ట్రోఫీలో తలపడుతాయి. ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను లంక క్రికెట్ బోర్డు తాజాగా వెల్లడించింది. తొలి మ్యాచ్ మార్చి 6న భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతుంది. పొరుగు దేశాలతో కలిసి తమ దేశ 70 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల తెలిపారు.

రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ టోర్నీ జరగనుంది. ఒక్కో జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. టాప్-2లో నిలిచిన జట్ల మధ్య మార్చి 18న తుది సమరం ఉంటుంది. ప్రేమదాస మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లన్నీ డే-నైట్ మ్యాచులే. భారత్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. టీ-20 సిరీస్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్స్ పార్కులో రెండో మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
షెడ్యూల్ వివరాలు :
శ్రీలంక-భారత్ (మార్చి 6), బంగ్లాదేశ్-భారత్ (మార్చి 8), శ్రీలంక-బంగ్లాదేశ్ (మార్చి 10), భారత్-శ్రీలంక(మార్చి 12), భారత్-బంగ్లాదేశ్ (మార్చి 14), బంగ్లాదేశ్-శ్రీలంక(మార్చి 16), మార్చి 18న ఫైనల్ మ్యాచ్ 

More Telugu News